2026 Sankranthi
2026 Sankranthi

2026 Sankranthi: సంక్రాంతికి కాలు దువ్వుతున్న టాలీవుడ్ టాప్ హీరోలు

పొంగల్ దంగల్ లో తగ్గేదేలేదంటున్న అగ్ర హీరోలు
బరిలో చిరు, బాలయ్య, వెంకీ, ఎన్టీఆర్

2026 Sankranthi: సంక్రాంతి పండగ తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఈ సమయంలో విడుదలైన సినిమాలు సాధారణంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతాయి. సెలవుల కారణంగా కుటుంబ సభ్యులు కలిసి సినిమా చూడటానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దీంతో సినిమా ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం భారీగానే వస్తుంటాయి. పిల్లలకు సెలవులు, పెద్దలకు నాలుగు రోజులు బ్రేక్ ఉండడంతో ఈ సీజన్లో పెద్ద సినిమాలతో పాటు వీలైతే చిన్న సినిమాలు కూడా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ముందస్తుగా కర్చీఫ్ వేస్తుంటారు.

పోంగల్ దంగల్..
2025 సంక్రాంతికి వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం”, బాలకృష్ణ నటించిన “డాకు మహారాజ్” సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అదే సమయంలో వెంకటేష్ కూడా 2026 సంక్రాంతికి తన సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే, ఇంకా విక్టరీ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. ఆయన ప్రస్తుతం కథలు వింటున్నారు, ఇందులో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక సినిమా ఉండే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్. యువ దర్శకుల కథలు కూడా వింటున్నారు వెంకీ.

సంక్రాంతి రిలీజ్..
ఇదే సమయంలో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న “అఖండ 2” సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా విజయదశమి రోజున విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్‌లో ఉండడంతో సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో, మెగాస్టార్ చిరంజీవి కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే ఈ సినిమా నాలుగు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో నిలపాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నారు. ఈ దిశగా షూటింగ్ షెడ్యూల్స్ కూడా సెట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్-నీల్ “డ్రాగన్”
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న “డ్రాగన్” సినిమా కూడా జనవరి 9 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు 2 వేల కోట్ల కలెక్షన్ల లక్ష్యంతో విడుదల కాబోతున్నది.

సంక్రాంతి ఫైట్..
దీంతో 2026 సంక్రాంతికి తెలుగు సినిమా ప్రేక్షకులు టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ చూడొచ్చని తెలుస్తున్నది. ఈ నలుగురు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తే, థియేటర్ల కొరత ఏర్పడక తప్పదు. సినిమాల విడుదల తేదీలపై ఇప్పటికైతే ఇంకా స్పష్టత లేదు. కానీ ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ నలుగురిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గే అవకాశం లేదని స్పష్టంగా కనిపిస్తుంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *