పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమా? లేక బౌలర్లకా?
PBKS vs KKR: ఐపీఎల్- 2025 సిరీస్ లో 31వ మ్యాచ్ ఈ నెల 15న న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం జరగనుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ ఆరో స్థానంలో ఉండగా, కోల్‌కతా ఐదో స్థానంలో ఉంది. ఇరు జట్లు సమానంగా ఆరు పాయింట్లతో నిలిచినా, నెట్ రన్ రేట్ ఆధారంగా స్థానాల్లో తేడా కనిపిస్తోంది.
ఈ మ్యాచ్ సందర్భంగా ముల్లన్‌పూర్ పిచ్ ఎలా ప్రవర్తించనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. బ్యాట్స్‌మెన్ హవా ఉంటుందా? లేక బౌలర్లు ఆధిపత్యం చూపుతారా? అన్నదానిపై దృష్టి సారిద్దాం.
ముల్లన్‌పూర్ పిచ్ విశేషాలు:
ముల్లన్‌పూర్ మైదానం సాధారణంగా రన్స్‌కు అనుకూలంగా ఉంటుంది. బంతి బ్యాట్‌పైకి సాఫీగా వచ్చే తత్వం వల్ల ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ మైదానంలో జరిగిన మ్యాచ్‌లలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువగా విజయం సాధించాయి. ఐపీఎల్ 2025లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లలో టాస్ గెలిచిన జట్లు ముందుగా బ్యాటింగ్ చేయడాన్ని ఎంచుకున్నాయి.
ఇక్కడ జరిగిన ఏడో మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు గెలవగా, మిగిలిన మూడు మ్యాచ్‌లలో లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించారు. అయితే సాయంత్రం మ్యాచ్‌ల సమయంలో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది, అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ చేయడం మంచిదని పలు సందర్భాల్లో కనిపించింది.
వాతావరణ వివరాలు:
ఆకాశం స్పష్టంగా ఉండే సూచనలు ఉన్నాయి. వర్షం పడే అవకాశాలు లేవు. మ్యాచ్ ప్రారంభానికి సమయానికి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఆట ముగిసే సమయానికి అది 27 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. తేమ స్థాయి 18 నుంచి 34 శాతానికి మధ్య ఉండే అవకాశం ఉంది. వీటి వల్ల ఆటపై పెద్దగా ప్రభావం చూపనుందని అంచనాలు ఉన్నాయి.