విశ్లేషకుల హెచ్చరికలు ఇదే సూచిస్తున్నాయా?
Recession: అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు కదులుతుందా అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. వాణిజ్య విధానాల్లో మార్పులు, ముఖ్యంగా చైనాతో సుంకాల వివాదం వంటి కారణాలతో ఆర్థిక రంగం ఒత్తిడిలో పడిపోయింది. ప్రస్తుతం ఆర్థిక సూచికలు బలహీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో, రాబోయే సంవత్సరాల్లో మాంద్యం తథ్యమవుతుందన్న అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో ఊపందుకుంటోంది.
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. గత ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న వ్యాపార నిర్ణయాలు ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. చైనాతో కొనసాగుతున్న సుంకాల పోరు అమెరికా వాణిజ్యాన్ని దెబ్బతీసింది. ఫలితంగా, వ్యాపార విశ్వాసం దిగజారుతోంది.
ముందు చూపే సంకేతాలు ఏమంటున్నాయంటే…
కాన్ఫరెన్స్ బోర్డ్ లీడింగ్ ఎకనామిక్ ఇండెక్స్ (LEI) గత 18 నెలల్లో 15 సార్లు పడిపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఇది సూచిస్తున్నది. రాయిటర్స్ సర్వే ప్రకారం, వచ్చే ఏడాది మాంద్యం వచ్చే అవకాశం 45 శాతంగా అంచనా. ఇది గత ఏడాదిలో కనిపించిన అత్యధిక అంచనాల్లో ఒకటి.
బిజినెస్ పెట్టుబడుల తగ్గుదల, తాజా వాణిజ్య విధానాల వల్ల 2025లో అమెరికా వృద్ధి రేటు 0.8 శాతం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మూడీస్ అనలిటిక్స్‌కు చెందిన మార్క్ జాండీ ప్రకారం, 2025 చివరినాటికి మాంద్యం వచ్చే అవకాశాలు 40 శాతం. బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు రే డాలియో కూడా మాంద్యం సమీపంలో ఉందని హెచ్చరించారు.
గతంలో మాంద్యాలు ఎలా ఉన్నాయంటే…
- 2001: డాట్‌కామ్ విఫలం వల్ల 8 నెలల మాంద్యం, నిరుద్యోగ రేటు 5.7 శాతం.
- 2007-09: గ్లోబల్ ఫైనాన్స్ సంక్షోభం వల్ల 18 నెలల మాంద్యం, జీడీపీ 4 శాతం తగ్గుదల, నిరుద్యోగం 10 శాతం.
- 2020: కరోనా సంక్షోభం రెండు నెలలు మాత్రమే కొనసాగింది కానీ జీడీపీ 19.2 శాతం తగ్గింది, నిరుద్యోగం 14.7 శాతం.
మాంద్యం అంటే ఏంటి..?
నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్(NBER) ప్రకారం, మాంద్యం అనేది ఆర్థిక వ్యవహారాల్లో కొంత కాలం పాటు కనిపించే గణనీయమైన తగ్గుదల. దీనిని ప్రామాణికంగా డెప్త్ (తీవ్రత), డ్యురేషన్ (కాలం), డిఫ్యూషన్ (ప్రభావ విస్తృతి) ఆధారంగా అంచనా వేస్తారు.
ప్రపంచంపై అమెరికా మాంద్య ప్రభావం
అమెరికా మాంద్యం వస్తే దాని ప్రభావం ప్రపంచ దేశాలపై తప్పనిసరిగా ఉంటుంది. 2001 మాంద్యం సమయంలో ప్రపంచ వృద్ధి 2.5 శాతంగా నమోదైంది. కానీ 2007-09 మాంద్యం సమయంలో ప్రపంచ జీడీపీ 1.3 శాతం తగ్గింది. కోవిడ్ సమయంలో అయితే ఇది 3 శాతం వరకు క్షీణించింది. 1945 తర్వాత ఇదే అత్యధిక క్షీణతగా నమోదైంది.