Alphores VNR
Alphores VNR

Alphores VNR: అల్ఫోర్స్ అధినేతకు భంగపాటు తప్పదా?

  • కాంగ్రెస్ పార్టీ షాకివ్వబోతున్నదా!
  • ప్రత్యామ్నాయం వైపు నరేందర్ రెడ్డి చూపు
  • మరో ప్రధాన పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు

Alphores VNR : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆశావహులు ఇప్పటికే ముందస్తు ప్రచారం చేపట్టిన విషయం తెలిసిందే. తమ ప్రచారాన్ని చూసి ఏదో ఒక పార్టీ టికెట్ ఇవ్వకపోతుందా అని ఆశావహులు మరింత ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పట్టభద్రులు ఓటు హక్కు కోసం ఎన్‌రోల్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల పట్టభద్రుల స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆశావహులు తమ పరిధిలోని గ్రాడ్యుయేట్లతో ఓటు హక్కు నమోదు చేయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపెయిన్లు నిర్వహించారు. ఇక తాము పలానా పార్టీ నుంచి బరిలో నిలవబోతున్నామంటూ అనధికారికంగా తమ ప్రచారంలో చెప్పుకొస్తున్నారు.ఈ పోటీలో అధికార కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. టికెట్ రాకున్నా తామే బరిలో ఉంటామంటూ ప్రచారం చేసుకోవడం కొసమెరుపు అయితే పార్టీని తమకు ఒక వేదికలా భావిస్తున్నారు. టికెట్‌ ఇవ్వకపోతే ఏమిటనేది మాత్రం ఇప్పటికైతే కొంత అనుమానంగానే ఉన్నది. బరిలో ఉంటారా? లేక తప్పుకుంటారా అనే చర్చ జరుగుతున్నది.

కాంగ్రెస్ నుంచే బరిలో ఉంటారా?

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవబోతున్నానంటూ అల్ఫోర్స్ అధినేత వీ నరేందర్ రెడ్డి తాను పుట్టి పెరిగిన జగిత్యాలలో ప్రకటించారు. నరేందర్ రెడ్డి ప్రస్థానం ట్యూటర్‌గా మొదలైన విషషయం తెలిసిందే. 34 ఏళ్లుగా విద్యారంగంలో విజయవంతంగా రాణిస్తున్నారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేతగా ఉత్తర తెలంగాణలో అగ్రస్థానంలో నిలిచారు. ఇక తన రాజకీయ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని పలు చోట్ల చెప్పుకొచ్చారు. ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నానని తాను ప్రచారానికి వెళ్లిన ప్రతీ చోట చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ నుంచి బరిలో దిగబోతున్నానంటూ ఆఫ్ ది రికార్డ్ చెప్పుకొస్తున్నారు.

అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో కాంగ్రెస్ అధిష్టానం నరేందర్ రెడ్డిని ఢిల్లీకి రమ్మన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇక అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్నది. కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం నరేందర్ రెడ్డి అంత సుముఖంగా లేనట్లు తెలుస్తున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అభ్యర్థుల పేర్ల జాబితాలో జీవన్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో అల్ఫోర్స్ అధినేతకు భంగపాటు తప్పదనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా సాగుతున్నది. దీంతో కాంగ్రెస్ కాదంటే మరో పార్టీ నుంచి బరిలో దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న లీకులతో నరేందర్ రెడ్డి ప్రత్యామ్నాయ అవకాశాలు సైతం చూసుకుంటున్నట్లు సమాచారం. తన అనుచరుల ద్వారా ఇతర పార్టీలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తున్నది.

క్షేత్రస్థాయిలో ఓట్లు పడేనా?

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ప్రస్తుతం తాను ప్రచారంలో చెబుతున్న హామీలకు, అల్ఫోర్స్ అధినేతగా వ్యవహరిస్తున్న తీరుకు భిన్నంగా ఉందనే వాదన వినిపిస్తున్నది. లక్షల్లో ఫీజులు వసూలు చేసే నరేందర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థి ఇస్తున్న హామీలకు పొంతన కుదరడం లేదంటున్నారు. తన విద్యా సంస్థలకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ పరంగా ఫీజులు వసూలు చేస్తున్నాడని పలువురి వాదన. ఇప్పటి దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ విషయంలో అంతగా ముందుకు రాని నరేందర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా తన విద్యా సంస్థల ఆధ్వర్యంలో టెట్ కు ఉచిత శిక్షణ ఇస్తామని ముందుకు రావడం గమనార్హం. ఇప్పటి వరకు అవేమీ గుర్తుకు రాలేదా అని పలువురు చర్చించుకుంటున్నారు. తన విద్యా సంస్థల వరకైతే ఒక తీరు.. ఎన్నికల సమయంలో మరోలా వ్యవహరించడం పక్కా అవకాశవాద రాజకీయమేననే చర్చ టాక్ నడుస్తున్నది.

– శెనార్తి మీడియా, మంచిర్యాల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *