- పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మసకబారుతున్న ‘గడ్డం’ ప్రభ
- సొంత నియోజక వర్గాలకే వినోద్, వివేక్ పరిమితం
- పెద్దపల్లి ఎంపీ జోక్యానికి ముందుగానే చెక్ పెట్టిన ఎమ్మెల్యేలు
- ఎన్నికలకు ముందే ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టొద్దని షరతులు !
- పదవి, పైసలున్నా.. ప్రయోజనం లేదని క్యాడర్ లో నిస్తేజం
Gaddam Family : గడ్డం వెంకటస్వామి.. కేవలం పెద్దపల్లి పార్లమెంట్ పరిధికే కాదు.. రాష్ట్ర, దేశ రాజకీయాలకు సుపరిచితం ఈ పేరు. రాజకీయ కురువృద్ధుడనే పేరు గడించాడు. దాదాపు 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. రాజకీయాల్లో అగ్ర వర్ణాలకే కాదు.. అణగారిన వర్గాలకూ స్థానం ఉందని దాదాపు 60 ఏళ్ల క్రితమే నిరూపించాడు. కుల వివక్ష వేళ్లూనుకున్న రోజుల్లోనే రాజకీయాల్లో తానో మహావృక్షమై నిలిచాడు. కార్మిక నేతగా, బడుగులకు పెద్ద దిక్కుగా నిలిచాడు. ఎంతో మందికి కాకా అయ్యాడు. ఇందిరాగాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు ఆ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. ఇక ఇందిరాగాంధీ హయాంలో, పీవీ హయాంలో కేంద్ర మంత్రిగానూ పని చేశారు. తెలంగాణ తొలి దశ,మలి దశ ఉద్యమంలోనూ పని చేశాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవాన్ని కళ్లారా చూశాడు. ఏకధాటిగా ఏడుసార్లు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించాడు.
పదవుల కోసం వెంపర్లాడని నేత
గడ్డం వెంకటస్వామికి కార్మిక నేతగా మంచి పేరుంది. వేలాది మంది పేదలకు గుడిసెలు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని కాకా దగ్గరుండి విజయవంతం చేశారు. తాను పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని వీడలేదు. పదవుల కోసం ఎలాంటి కుట్రలో చేయలేదు. నికార్సయిన కాంగ్రెస్ నేతగా పేరు తెచ్చుకున్నాడు.
మచ్చలేని నేత
1957లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు కాకా. ఎన్నో పదవులు అధిరోహించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఇటు రాష్ర్టంలోనూ, అటు దేశంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ లో కాకాకు ఎదురు తిరిగిన నాయకుడు లేడు. ఎక్కడకు వెళ్లినా అక్కున చేర్చుకొని ఆదరించారే తప్ప.. పొమ్మనలేక పొగబెట్టిన వారు ఆయన రాజకీయ జీవితంలో లేరు. అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు.
కుమారుల ఎంట్రీతో మారిన సీన్
రాజకీయాల్లో కాకా స్వయంగా ఎంతో ఎదిగిన ఆయన కుమారుల పొలిటికల్ ఎంట్రీతో పరిస్థితుల్లో మార్పులు మొదలయ్యాయి. వారి రాజకీయ నిలకడలేమి గడ్డం ప్రభను మసకబార్చుతున్నది. అధికారం ఎక్కడుంటే తాము అక్కడే అన్న చందంగా గడ్డం కుటుంబం మారింది. కాకా 1999లో తన పెద్ద కుమారుడు గడ్డం వినోద్ ను చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి బరిలోకి దింపగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2004లో అదే నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో నిలిపి గెలిపించకున్నాడు. 2009లో తన చిన్న కుమారుడు వివేక్ ను పెద్దపల్లి ఎంపీ స్థానంలో నిలబెట్టి గెలిపించుకున్నాడు. కానీ తండ్రి వారసత్వాన్ని, రాజకీయ విలువలను కాకా కుమారులు కాపాడడం లేదని క్యాడర్ నుంచి ఎంతో కాలంగా వినిపిస్తున్నది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, బీజేపీల్లోకి మారారు. దీంతో తాము ఎప్పుడు ఏ పార్టీలో ఉండాల్సి వస్తుందోనని వారి వెంట ఉండే క్యాడర్ లోనూ అయోమయం నెలకొంది.
గత అసెంబ్లీ ఎన్నికల నుంచే చెక్?
గడ్డం ఫ్యామిలీ పాలిటిక్స్ కు గత అసెంబ్లీ ఎన్నికల నుంచే చెక్ పడిందని అనుచరుల్లో చర్చ నడుస్తున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివేక్, ఆయన కుమారుడు వంశీ బీజేపీ నుంచి కాంగ్రెస్ లో మళ్లీ చేరారు. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ పార్టీ రెండు అసెంబ్లీ టికెట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కారణంగా వినోద్ బెల్లంపల్లి నుంచి, వివేక్ చెన్నూర్ నుంచి విజయం సాధించారు. అటు గెలిచారో లేదో మంత్రి పదవుల కోసం లాబీయింగ్ మొదలు పెట్టారనే చర్చ జోరుగా సాగింది. ఏఐసీసీ స్థాయి పెద్దల అండదండలున్నా స్థానిక నేతల అభిప్రాయానికే అధిష్టానం సైతం మొగ్గు చూపుతున్నదనే వాదన ఉన్నది.
మూడో తరం ఎంట్రీ..
మంత్రి పదవి రాకపోవడంతో గడ్డం వివేక్ తన కుమారుడికి పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం పట్టుబట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైంది. సొంత పార్టీ నేతలపై వంశీ తన అనుచరులతో సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ఏఐసీసీ స్థాయిలో అక్షింతలు పడ్డాయని పార్టీలో గుసగుసలు వినిపించాయి. దీంతో పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సయోధ్య కుదుర్చుకొని ఎలాగోలా టికెట్ ఇప్పించుకోగలిగారు. తనకున్న పలుకుబడి, బీఆర్ఎస్ మీది వ్యతిరేకత కలిసి వచ్చింది.
ఎక్కడికక్కడే అడ్డుకట్ట !
పెద్దపల్లి పార్లమెంట్ నియోజవకర్గంలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టకుండా గడ్డం వంశీ రాష్ర్ట స్థాయి కీలక నేతతో అడ్డుకట్ట వేయిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేలకు తెలియకుండా వారి నియోజక వర్గాల్లో ఎంపీ అడుగు పెట్టలేని పరిస్థితి ఉందని కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పదవి, పైసలున్నా పతారా లేదని క్యాడర్ నిస్తేజంలో ఉన్నట్లు టాక్ ఉంది.
మంచిర్యాల ఎపిసోడ్ తో మరింత బలం
మూడు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆస్పత్రికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ఆహ్వాన పత్రికలో పెద్దపల్లి ఎంపీ పేరు లేకపోవడం గమనార్హం. మంచిర్యా జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే ఉన్నా, ఆహ్వాన పత్రికలో ఎంపీ పేరులేకపోవడంపై మూడు రోజులుగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. గడ్డం ఫ్యామిలీకి ఎక్కడికక్కడ మరింత చెక్ పెడుతున్నారని అటు కాంగ్రెస్ లో, ఇటు ప్రతిపక్ష పార్టీల్లోనూ టాక్ వినిస్తున్నది. అయితే వారి ఒంటెత్తు పోకడలు, పార్టీ ఫిరాయింపులే ఇందుకు కారణమనే చర్చ కూడా సాగుతున్నది.
– శెనార్తి మీడియా, మంచిర్యాల