MLC Voting
MLC Voting

MLC Voting: మీరు వేయాలె.. మరో పది మందితో వేయించాలె !

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలానా అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఒత్తిళ్లు
  • ప్రైవేట్ టీచర్లపై యాజమాన్యాల హుకూం
  • కాసుల కోసం కక్కుర్తి ?

MLC Voting:మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న వారి కోసం జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల యజమానులు కాసులకు కక్కుర్తి పడి తమ స్కూళ్లలోని ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నారు. నిన్న మొన్నటి వరకు సభ్యత్వం నమోదు పేరిట ఇబ్బంది పెట్టిన యాజమాన్యాలు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పలానా వ్యక్తికి ఓటు వేయడంతో పాటు మరో 10 మంది పట్టభద్రులతో ఓటు వేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రైవేట్ పాఠశాలల యజమానుల సంఘం ( ట్రస్మా ) నాయకులు కొందరు ఎమ్మెల్సీ అభ్యర్థికి జిల్లాలో మీ తరఫున ప్రచారం చేస్తామని సభ్యత్వ నమోదు తో పాటు ఓటు వేయించే వరకు అన్ని తామే చూసుకుంటామని అభ్యర్థులకు మాట ఇచ్చినట్లు సమాచారం. ఇక సభ్యత్వ నమోదు నుంచి మొదలు పలానా అభ్యర్థికి ఓటు వేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారంతో పాటు కూడా పలానా వ్యక్తికే ఓటు వేయాలని తమ వాట్సప్‌లలో స్టేటస్ లు పెట్టుకోవడం గమనార్హం.

విద్యాబుద్ధులు నేర్పాల్సిన యాజమాన్యాలు తమ టీచర్లకు పొలిటికల్ పాఠాలు నేర్పుతూ స్కూళ్లను రాజకీయాలకు అడ్డాగా మారుస్తున్నాయంటూ పలువురు విద్యా వంతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యావంతులైన కొందరు మేధావులు విమర్శిస్తున్నారు. చదువును వ్యాపారం చేసిన యాజమాన్యాలు ఇప్పడు రాజకీయాన్ని సైతం వ్యాపారంగా మలుచుకుంటున్నాయి. ఓటు అనేది స్వచ్ఛందంగా వేయాల్సి ఉండగా, కొందరి స్వలాభం కోసం నోటు డిసైడ్ చేస్తున్నది. ఇలా వారి స్వార్ధం కోసం ఓ వ్యక్తికి మద్దతు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్న వారిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాజకీయ స్వలాభం కోసమేనా యూనియన్లు..?
డబ్బు ఉందని అహం, తన రాజకీయ స్వలాభం కోసం కొందరు జిల్లాలో ఒకే పేరుమీద రెండేసి ట్రస్మా యూనియన్లు నడుపుతున్నారు. ఓ యూనియన్ విద్యా వ్యవస్థ కోసం పోరాడుతుంటే, మరో యూనియన్ రాజకీయం చేస్తున్నది. వ్యక్తిగతంగా ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా పర్వాలేదు కానీ వారి రాజకీయ అభిష్టాన్ని కింది స్థాయి తమ పాఠశాలలోని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులపై రుద్దడం ఏ మాత్రం సబబు కాదని ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడేందుకు ఒక సంఘం సరిపోతుందని, కానీ మాకే పదవులు కావాలని మరో సంఘం నడపడం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు సమస్య వస్తే ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక తర్జనభర్జన పడాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొంది.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *