shanigukunta blastng
shanigukunta blastng

ShanigaKunta: శనిగకుంటను చెరపట్టిందెవరు..?

 బాంబులతో పేల్చేసి.. జలసంపదను మాయం‌ చేసేందుకు యత్నం
జనావాసాలకు సమీపంలో పేలుళ్లతో భయాందోళనలో ప్రజలు
బ్లాస్టింగ్ తో ఎగిరిపడిన రాళ్లు.. అనుకోకుండా ఆ సమయంలో ఎవరైనా వస్తే పరిస్థితి ఏమిటి?
తలుచుకుంటే ఒళ్లు జలదరిస్తుందంటున్న ప్రజలు

ShanigaKunta: రాష్ట్రమంతా చెరువులను కాపాడాలనే దృఢసంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ట్ర రాజధానిలో‌ “హైడ్రా” కూల్చివేతలతో చెరువుల ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు‌ పరిగెడుతున్నాయి. అయితే మంచిర్యాల‌ జిల్లాలో మాత్రం రియల్ మాఫియా, భూ కబ్జా కేటుగాళ్లు ఏకంగా చెరువులను మాయం చేయాలని కుట్రలు చేస్తున్నారు. ఏకంగా చెరువు మత్తడిని బాంబులతో పేల్చేసి, చెరువులోని నీళ్లనంతా ఖాళీ చేసేలా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆ చెరువే ఆధారంగా బతికే వందలాది మంది రైతులు, మత్స్యకారులు లబోదిబోమంటున్నారు.

బ్లాస్టింగ్ కలకలం
మంచిర్యాల‌ జిల్లా చెన్నూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ లక్ష్యానికే సవాల్ విసిరేలా సాగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.
వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ లోని శనిగకుంట చెరువును గుర్తు తెలియని దుండగులు, డిటోనేటర్లను పెట్టి పేల్చి వేయడం స్థానికంగా సంచలనం రేపింది. జాతీయ రహదారి సమీపంలో ఉన్న శనిగకుంట మత్తడిని గుర్తు తెలియని దుండగులు పేల్చేశారు. దశాబ్దాల క్రితం నిర్మించిన కాంక్రీట్ మత్తడిని పేల్చి వేసి కుంటలోని నీటిని మొత్తం ఖాళీ చేసేందుకు కుట్రకు తెరతీశారు. ఈ ఘటనతో 42 ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్న రైతులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ కుంటను అంత సలువుగా కూల్చేయలేదని, ఏకంగా 40 చోట్ల డిటోనేటర్లు పెట్టి మత్తడిని పేల్చివేశారని ఇరిగేషన్ అధకారులు గుర్తించారు. అయితే ఇంత దారుణానికి పాల్పడడం వెనుక భారీ కుట్రనే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా పక్కనే ఉన్న ఓ వెంచర్ నిర్వాకుల పనేనని స్థానికులు చర్చించుకోవడం గమనార్హం.

పక్కా ప్రణాళికతోనే బ్లాస్టింగ్
అయితే చెరువు‌కట్టను కూల్చి వేయడం అంత ఈజీగా సులువుగా సాగలేదు. ఎవరి కంటపడకుండా పేల్చివేయాలనుకున్నారు. ముందస్తుగా రంధ్రాలు చేసి జిలెటిన్ స్టిక్స్ అమర్చి డిటోనేటర్లను అనుసంధానం చేసి పేల్చి వేశారని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. కుంట మత్తడి ప్రాంతంలో విద్యుత్ సరఫరా కూడా లేదు. డ్రిల్లింగ్ మిషనరీని ఉపయోగించేందుకు జనరేటర్లు లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని ఉంటారన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ కుంట మత్తడిని ఎందుకు పేల్చివేయాల్సి వచ్చింది. ఆ అవసరం ఎవరికి ఉంది? ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు..? మత్తడి పేల్చేసేందుకు డిటోనేటర్లు ఎక్కడి నుంచి తెచ్చారు అన్నది తేలాల్సి ఉంది..?

ఇరిగేషన్ అధికారులు ధ్వంసమైన మత్తడిని బుధవారం పరిశీలించారు. ఘటనకు‌ కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఈ కుట్రకు కారకులు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. చెన్నూరు సీఐ రవీందర్ నేతృత్వంలో పోలీస్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలం నుంచి పేలుడు కోసం ఉపయోగించిన వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి స్పందించారు. చెరువు ఆయకట్టు రైతుల పంటలకు నీరు అందేలా వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ధ్వంసమైన మత్తడిపై ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు.

blasting wires
blasting wires

అసలు మందుగుండు ఎక్కడిది…?
చెన్నూర్ శెనిగకుంటలో మందుగుండు సామాగ్రి ఎక్కడి నుండి వచ్చింది..? ఈ వారి స్కెచ్ ఎవరిది? పక్కనే ఉన్న వెంచర్ లోకి నీరు వస్తుందనే నెపంతో వారే ఈ కుట్రకు పాల్పడ్డారా? లేక ఇంకా ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే బ్లాస్టింగ్ సమయాల్లో చుట్టు 500 మీటర్ల వరకు రాకపోకలు నిలిపిస్తుంటారు. అయితే ఈ బ్లాస్టింగ్ మాత్రం రాత్రివేళలో జరిగినట్లు తెలుస్తున్నది. బ్లాస్టింగ్ తో మత్తడి రాళ్లు వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఒకే ఆ సమయంలో రైతులు లేదా ఇతరులు అటు వైపు వెళ్లి ఉంటే ఏమయ్యేదోనని స్థానికులు భయాందోళన చెందుతున్నది. తల్చుకుంటేనే భయంగా ఉందంటున్నారు. పేలుడు సమయంలో అటు వైపు ఎవరైనా వెళ్లి ఉంటే కచ్చితంగా ప్రాణ నష్టం జరిగేదని అనుకుంటున్నారు.

కండువా మార్చిన నాయకుడి పనేనా..?
శనిగకుంట దారుణానికి పాల్పడింది కండువా మార్చిన నాయకుడి పనేనా అంటూ స్థానికులు చర్చించుకోవడం గమనార్హం. గతంలో ఓ అధికా పార్టీలో ఉన్న అధికార పార్టీలో ఉన్న నాయకుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీలో చేరాడని, అతనే దీనికి కారణమై ఉంటాడని స్థానికులు గుసగుసలాడడం కనిపించింది. కండువా మార్చుకున్న వారు అధికార పార్టీ అండదండలతో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడితే ఎవరూ ఏం చేయలేరనే అతి నమ్మకమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

చెరువులో నీరు ఖాళీ చేస్తే ఎవరికి లాభం…?
శనిగకుంట చెరువు 348, 365 సర్వే సంబర్లలో సుమారు 39 ఎకరాల విస్తీర్ణం లో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. చెరువు శిఖం 33.22 ఎకరాలు ఉండగా ఎఫ్ టీఎల్ 42 ఎకరాలు, చెరువులో నీటి నిల్వ కెపాసిటీ 9.45 మిలియన్ క్యూబిక్ ఫీట్ (ఎంసీఎఫ్)లు ఉంది. బఫర్ జోన్ కలుపుకొని సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో శనిగకుంట ఉన్నది. మత్తడి మూడు మీటర్ల ఎత్తులో ఉండగా బ్లాస్టింగ్ మూలంగా ఇప్పటికే చెరువులో నుంచి 40 శాతం వరకు నీరు వృథాగా పోయిందని స్థానికులు చెబుతున్నారు. దీనితో ఈ చెరువుపై ఆధారపడి 43 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్న రైతులకు, చెరువులో చేప పిల్లలు వేసిన మత్స్యకారులకు నష్టం వాటిల్లింది. అప్పుడు అధికారంలో ఉన్న నాయకుల అండదండలతో గత ఏడాది చెరువు, బఫర్ జోన్ లో ఓ నాయకుడు 4 వేల ట్రిప్పు ల మొరం నింపి చెరువు కబ్జాకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు మొరం నింపిన స్థలం చుట్టూ చేరగా, మరోవర్షం పడితే నింపిన మట్టి మునుగుతుందనే భావించి, ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్థానికంగా చర్చ జరుగు తున్నది.

రెవెన్యూ రికార్డులే లేవట?
చెన్నూర్ పట్టణానికి సంబంధించి ఎలాంటి మ్యాప్ లు, రికార్డులు లేవని స్థానిక తహసీల్దార్ ఈర్ల మల్లికార్జున్ స్వయంగా చెప్పవడం గమనార్హం. తాను ఇక్కడికి వచ్చి ఏడాది అవుతుందని, వచ్చిన కొత్తలోనే ఈ విషయం అడిగానని, కొన్నేళ్లుగా భూ సర్వే నంబర్లతో కూడిన రెవెన్యూ మ్యాప్ లు గానీ, రికార్డులు, నక్షలు గానీ లేవని చెప్పడం గమనార్హం. సర్వే అధికారులను కూడా ఫోన్లో సంప్రదించగా ఇదే సమాధానం చెబుతుండడం కొస మెరుపు అసలు చెన్నూర్‌లో చెరువుల సర్వే నంబర్లు, చుట్టూ సాగు భూముల వివరాలు, సర్వే నంబర్లు లేకుం ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది కబ్జా దారులకు వరంగా మారడంతో ఎక్కడెక్కడి సర్వే నంబర్ భూ పట్టా పాసు బుక్కులతో చెరువులను కబ్జా చేసేస్తున్నారా అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి. మాయమైన రెవెన్యూ మ్యాపులు, రికార్డులపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనాఉంది.

– శెనార్తి మీడియా, మంచిర్యాల 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *