తన ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళపై అత్యాచార యత్నం
తప్పించుకుని 100కి డయల్
పోలీసులకు ఫిర్యాదు
నిందితుడికి మద్దతు నిలిచిన ఖాకీలు
కేసును నీరుగార్చుతూ సయోధ్య
బాధితురాలి కుటుంబ సభ్యులతో వాట్సప్ గ్రూపులో వీడియో పోస్ట్.. కాసేపటికే డిలీట్..
జమ్మికుంటలో హాట్ టాపిక్ గా మారిన అత్యాచార యత్నం కేసు..
Teacher Harrasment: జమ్మికుంటలో ఓ కీచక ఉపాధ్యాయుడి బాగోతం బహిర్గతమైంది. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఆ కీచకుడికి చెర నుండి తప్పించుకుని బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతవరకు బాధితురాలి వ్యధ కనిపిస్తున్నా.. ఠాణాకు చేరిన వ్యవహారం కొన్ని గంటల్లోనే తారుమారు అయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యుల ద్వారా వాట్సప్ గ్రూపులో ఓ పోస్ట్ రిలీజ్ చేశారు. కాసేపట్లోనే ఆ వీడియోను డిలీట్ చేయించారు. పోలీసుల జోక్యంతో నిందితుడికి మద్దతుగా సెటిల్మెంట్ జరిగినట్లు జమ్మికుంటలో ప్రచారం జోరందుకుంది. పట్టణంలో హాట్ టాపిక్ గా మారిన ఉపాధ్యాయుడి కీచక ఘటనపై ఖాకీ వర్గాల్లోనే గుసగుసలు గుప్పుమంటున్నాయి.
అసలేం జరిగింది…
జమ్మికుంట పట్టణ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో కొంత కాలంగా ఓ దంపతులు ఇద్దరు అద్దెకు ఉంటున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో తన ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ఊహించని ఘటనతో ఆ మహిళ ఒక్క సారిగా భయాందోళనకు గురైంది. తీవ్ర ప్రయత్నింతో ఎలాగోలా అతడి చెర నిండి బయట పడి 100 డయల్ చేసింది. పోలీసులు వచ్చేసరికి సదరు ఉపాధ్యాయుడు పరారయ్యాడు. దీంతో బాధిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి కేసు లేకుండానే కథను సుఖాంతం చేసేశారు. మహిళ పక్షాన నిలిచి న్యాయం చేయాల్సిన పోలీసులు పలువురి పెద్ద మనుషుల సహకారంతో సెటిల్మెంట్ తో కేసును నీరుగార్చరన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పిర్యాదు ఇచ్చిన బాధిత కుటుంబ సభ్యులను స్టేషన్ కు పిలిపించి తమదైన శైలిలో భయ బ్రాంతులకు గురి చేశారు. దీంతో వారు ఇద్దరు కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పిన మాటలను పోలీసులు స్వయంగా వీడియో తీసి గ్రూపులో పోస్ట్ చేశారు. ఇది పెట్టిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆ వీడియో డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా పోలీస్ బాస్ ఆరా..!
జమ్మికుంట పట్టణంలోని మహిళపై ఉపాధ్యాయుడి అత్యాచార యత్నం కేసుపై జిల్లా పోలీస్ కమిషనర్ ఆరా తీసినట్లు సమాచారం. జిల్లాలో శాంతి భద్రతల విషయంలో.. పోలీసు వ్యవస్థలో తనదైన మార్క్ ఏర్పాటు చేసుకున్న పోలీస్ బాస్ దృష్టిలో ఈ సంఘటన వెళ్లిందా.. లేదా..? అంటూ జమ్మికుంటలో చర్చ జరుగుతోంది. ఈ ఘటనలో పోలీసుల పాత్రపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.