PSR vs BANDI
PSR vs BANDI

PSR vs BANDI : పీఎస్సార్‌కు ‘బండి’ చెక్ పెట్టేనా?

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ టచ్‌లోకి మంచిర్యాల బీఆర్ఎస్ నాయకులు
  • అధికార పార్టీని ఢీకొట్టలేక చేతులెత్తేస్తున్న నడిపెల్లి
  • ప్రత్యామ్నాయం చూసుకుంటుున్న గులాబీ లీడర్లు

PSR vs BANDI : తెలంగాణ ఉద్యమ కాలం నుంచి అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి మంచిర్యాల జిల్లా అండగా నిలుస్తూ వస్తున్నది. గత పదేళ్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గులాబీ పార్టీకి పెట్టని కోటగా నిలిచింది. కానీ మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మాత్రం ఉద్యమ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు దారుణంగా ఓటమి చెందారు. ఉమ్మడి ఆదిలాబాద్ లోని 10 నియోజకవర్గాలకు గాను కేవలం ఇద్దరు మాత్రమే గెలిచి తమ ఉనికి చాటుకున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి జాదవ్ అనిల్, ఇటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ నుంచి కోవ లక్ష్మి మాత్రమే గెలిచారు. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌కు దారుణ ఒటమి తప్పలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ తన ప్రభావాన్ని కోల్పోతున్నది. ఇక బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బాల్క సుమన్ గెస్ట్ లీడర్ లా వచ్చిపోతున్నాడే తప్ప పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదు. వచ్చినప్పుడల్లా అధికార పార్టీ నాయకులను విమర్శలు చేస్తూ వెళ్లి పోవడమే తప్ప క్యాడర్ ను పట్టించుకోవడం లేదనే అపవాదును మూటగట్టుకుంటున్నాడు. ఏకంగా జిల్లా కేంద్రంలోనే గులాబీ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

గులాబీ పార్టీని వెంటాడుతున్న పీఎస్సార్

మంచిర్యాల ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గులాబీ పార్టీ వెంటపడుతుతున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మున్సిపాలిటీలను హస్తగతం చేసుకున్నాడు. ఇక్కడి నుంచే బీఆర్ఎస్ తొలి దెబ్బ పడింది. అక్కడి నుంచి బీఆర్ఎస్ ను కకావికలం చేస్తున్నాడు. బీఆర్ఎస్ నాయకుడు డీకొండ అన్నయ్య అక్రమ నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులతో పీఎస్సార్ స్వయంగా కూల్చివేయించాడనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం బీఆర్ఎస్ లీడర్లనే టార్గెట్ చేసుకొని  వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నానే చర్చ మంచిర్యాల నియోజకవర్గంలో  చర్చ  సాగుతున్నది. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు నడిపెల్లి దివాకర్ రావు పీఎస్సార్ ను ఢీకొనలేకపోతున్నాడనే చర్చ జరుగుతున్నది. నడిపెల్లి దివాకర్ రావు చేతులెత్తేయడంతో పార్టీ శ్రేణులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాయనే చర్చ జరుగుతున్నది.

‘బండి’ దారిలోకి గులాబీ లీడర్లు

గులాబీ లీడర్లు కొందరు తమ రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకునేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంంత్రి బండి సంజయ్ కుమార్‌ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు పెత్తనం చెలాయించిన గులాబీ లీడర్లు ప్రస్తుతం ప్రత్యా్మ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. పదేళ్లు తన వెన్నంటే ఉన్న వాళ్లకే ముందుగా ప్రాధాన్యం ఇస్తానని చెబుతుండడంతో కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచనను విరమించుకుంటున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే తమకు మరో మార్గమని భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు లీడర్లు బండి సంజయ్ ను ఆశ్రయించినట్లు తెలిసింది. తాము కాషాయ కండువా కప్పుకుంటామని చెబుతున్నట్లు సమాచారం.

పీఎస్సార్ చెక్ పెట్టేనా?

బీజేపీలో చేరుతామని చెబుతున్న లీడర్లు ప్రస్తుతం మంచిర్యాలలో జరుగుతున్న పరిణామాలను బండికి వివరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే పీఎస్సార్ నుంచి తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిసింది. మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలుంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక ఎమ్మెల్యే పీఎస్సార్‌కు చెక్ పెడతాడా అనే చర్చ సాగుతున్నది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ లీడర్లు సంప్రదించిన సమయంలో బండి సంజయ్ మంచిర్యాలకు వస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. కానీ గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో బండి మంచిర్యాల పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఒక వేళ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరికలు మొదలైతే ఇక్కడి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి దాకా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న పోరు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మారుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు ఉంటాయా? బండి పర్యటన అనంతరం మంచిర్యాలలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో కొద్ది రోజుల్లో తేలనుంది.

– శెనార్తి మీడియా, మంచిర్యాల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *