- సార్లు తవ్వుకొమ్మన్నరు… మేము తవ్వుకుంటున్నం
- మంచిర్యాల జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు
- బావులను తలపిస్తున్న మట్టి తవ్వకాలు…
- పట్టించుకోని అధికారులు
Sand Mafia :మంచిర్యాల జిల్లాలో జిల్లాలో మట్టి దందా జోరుగా సాగుతున్నది. రాత్రింబవళ్లు హెవీ లోడ్ టిప్పర్లతో మట్టి రవాణా సాగుతున్నది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం, రామారావుపేట శివార్లలో మట్టి తవ్వకాలు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులను తలపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో తవ్వకాలు సాగుతున్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం దృష్టి సారించడం లేదు. దీంతో మట్టి మాఫియాది ఆడిందే ఆట.. పాడిందే పాట సాగుతున్నది.
సార్లు తవ్వుకొమ్మన్నరు… మేము తవ్వుకుంటున్నం
‘మట్టి తరలించే దళారులు ఏ మాత్రం భయం లేకుండా సార్లే తవ్వుకోమన్నారు.. మేము తవ్వుకుంటున్నాం..ఇంతే తవ్వాలి.. అంతే తవ్వాలి అని రూల్స్ ఎం లేవు. ఎవరికీ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చినం ఇక ఎవ్వరికి భయపడేదే లేదు’ అని బాహాటంగానే చెబుతున్నారంటే అధికారులకు ఎంత ముట్టజెప్తున్నారో వారి మాటలను అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఒక్కో లారీ పదుల ట్రిప్పులు మట్టిని తరలిస్తున్నది. దూరాన్ని బట్టి రేటు నిర్ణయించి అడ్డగోలుగా లెక్కా పత్రం లేకుండా రవాణా సాగిస్తున్నారు. ఎలాంటి అనుమతి పత్రం లేకుండా పెద్ద మొత్తంలో మట్టి తరలిస్తున్నా ఇటు రెవెన్యూ, అటు పోలీస్, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బావులను తలపిస్తున్న తవ్వకాలు…
జైపూర్ మండలం రామారావుపేట, ఇందారం గ్రామ శివారులో సింగరేణి ఓసీని అనుకోని ఉన్న పంట భూములను ఆసరాగా చేసుకొని నస్పూర్ కు చెందిన కొందరు మట్టి మాఫియా కేటుగాళ్లు పెద్ద మొత్తంలో దందా సాగిస్తున్నారు. సింగరేణి వేసిన హద్దులను అనుకోని ఉన్న ట్రెంచ్/ కందాలను తొలగిస్తూ సింగరేణి అధికారులు వేసిన హద్దు రాయి వరకు జేసీబీకి ఎంత అందితే అంతవరకు తోడేస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 కి పైగా ఫీట్ల వరకు లోతుగా మట్టి తీస్తుండడంతో ఆ ప్రాంతమంతా బావులను తలపిస్తుంది. దీంతో సమీప వ్యవసాయ పొలాల బావుల్లో నీరు కూడా తగ్గుతున్నది.. ఇలా బావుల మాదిరిగా తవ్వుతుండడంతో తమకు నష్టం కలుగుతున్నదని పక్కనే ఉన్న పొలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మట్టి తరలింపునకు ప్రత్యేక రోడ్డు…
తమ రవాణాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సింగరేణి ఓసీ మట్టిని వాడుకొని రోడ్లు సైతం వేసుకోవడం గమనార్హం. ఎటు చూసిన సింగరేణి కొండలు తలపిస్తుంటే వీరి మట్టి రవాణాకు సింగరేణి మట్టిని సైతం వాడుకుంటున్నారు. రైతుల పంటపొలాలకు రోడ్లు వేస్తున్నామని మట్టి మాఫియా చెప్పడం కొసమెరుపు.
అడగడానికి మీరెవ్వరు?
ఒకే చోట రెండు జేసీబీలతో మట్టి తవ్వుతున్నారని ప్రశ్నిస్తే అడగడానికి మీరెవ్వరు అంటూ అక్కడ ఉన్న వ్యక్తి దబాయిచడం గమనార్హం. ‘శెనార్తి మీడియా‘ ఫొటోలు తీస్తుండడంతో అక్కడ ఉన్న ఆ వ్యక్తి సదరు మట్టి మాఫియా నిర్వాహకులకు ఫోన్ చేస్తూ వెళ్లిపోయాడు. అక్కడ ఉన్న డ్రైవర్ ను అడిగితే ఆ జేసీబీ నస్పూర్ తాళ్లపల్లి లోని అర్ అండ్ అర్ కాలనీ కి చెందిన నరేష్ గౌడ్ అనే వ్యక్తి ది అని చెప్పారు. లోతు ఇంత ఎలా తీస్తున్నారు అని అడిగితే.. జేసీబీ బొక్కెనకు ఎంత అందితే అంత తీయమని మా సేటు చెప్పాడని సదరు డ్రైవర్ పేర్కొనడం కొసమెరుపు. మరో జేసీబీ డ్రైవర్ ను అడిగితే మా ఓనరు ఎవరైతే మీకెందుకంటూ దురుసుగా సమాధానం ఇవ్వడం కొసమెరుపు
శెనార్తి మీడియా, మంచిర్యాల