- కండువాలు మారినా కమ్యూనిజం వీడని మల్కాజిగిరి ఎంపీ
- సికింద్రాబాద్ బంద్ లో పాల్గొని ఆశ్చర్యపరిచిన బీజేపీ నేత
Etela : బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన రూటు మార్చాడా అనే చర్చ జరుగుతున్నది. వామపక్ష భావజాలాన్ని నరనరానా జీర్ణించుకున్న ఈటల బీజేపీలో చేరినా కూడా మొన్నటి దాకా అవే సిద్దాంతాలను అనుసరించాడు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం వామపక్ష భావాలను వీడి పూర్తిగా కాషాయ సిద్ధాంతాలను ఒంటబట్టించుకుంటున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారంహిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ లో ఈటల పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కమ్యూనిజం టు కాషాయం వయా గులాబీ జెండా
ఈటల ముందు నుంచి అభ్యుదయ భావాలు ఎక్కువ. ఈటల కాలేజీ విద్యనభ్యసిస్తున్న సమయంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ లో చురుగ్గా పని చేశారు. కమ్యూనిజం భావజాలాన్ని తన నరనరాన నింపుకున్నారు. అప్పటి టీఆర్ఎస్ లో చేరినా తన వామపక్ష భావజాలాన్ని వీడలేదు. ఆ తర్వాత గులాబీ జెండాను వీడినా కాషాయ జెండా కప్పుకున్నా అదే భావజాలం కొనసాగిస్తూ వచ్చాడు. బీజేపీలో చేరినా వామపక్ష భావజాలాన్ని వీడలేదనే విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు ఈటల.
భారత్ మాతాకీ జై అనని బీజేపీ నేత ఈటల
బీజేపీలో కార్యకర్త నుంచి అధ్యక్షుడి దాకా ప్రతి ఒక్కరూ తమ ప్రసంగం మొదలు పెట్టే ముందుకు భారత్ మాతా కీ జై అని నినదిస్తారు. ఆ తర్వాతే తమ ప్రసంగం ప్రారంభిస్తారు. ఇది ప్రధాని మోదీ నుంచి కార్యకర్త వరకు ఇదే విధానాన్ని అనుసరిస్తారు. కానీ ఈటల తన ప్రసంగం ప్రారంభం ముందు ఎప్పుడూ భారత్ మాతాకీ జై అనలేదని బీజేపీ కార్యకర్తల్లో చర్చించుకుంటుంటారు. 2021 ఉప ఎన్నికల సమయంలో ఒక్కసారిగా భారత్ మాతా కీ జై అనలేదని కొందరు బీజేపీ కార్యకర్తలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వామపక్ష భావజాలం కారణంగానే బీజేపీ రాష్ర్ట అధ్యక్ష పదవికి దూరమయ్యాడనే వాదన కూడా ఉన్నది.
సికింద్రాబాద్ బంద్ లో ఈటల
బీజేపీ అంటేనే పక్కా హిందూత్వ నినాదం. ఈ నినాదాన్ని ఇప్పటి వరకు ఈటల అనుసరించలేదని బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. 2021లో చేరినప్పటి నుంచి మొన్నటి వరకు ఈటల ఆలయాల గురించి గానీ, హిందుత్వ నినాదాన్ని ఎత్తుకోలేదు. ఒక్కసారిగా హిందూ సంఘాలతో కలిసి సికింద్రాబాద్ బంద్ లో ఈటల పాల్గొనడంతో పొలిటికల్ సర్కిళ్లలో తీవ్ర చర్చ జరుగతున్నది. గతంలోనూ హిందూ ఆలయాలు దాడి జరిగిన సందర్భంలో ఒక్కసారి కూడా ఈటల స్పందించలేదు. హిందూ దేవుళ్లపై పలువురు కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినా ఏనాడు ఈ విషయం మీద పెదవి విప్పలేదు. కానీ ఒక్కసారిగా ఈటల హిందుత్వ నినాదం ఎత్తుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే దీని వెనుక ఏమైనా రాజకీయ కోణం ఉన్నదా, లేక నిజంగానే హిందుత్వ నినాదాన్ని ఎత్తుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.