Hanuman : ‘వేయిమంది రావణులైనా యుద్ధంలో నాముందు నిలువలేరు. శిలలతో, వృక్షాలతో సకల రాక్షసులను, లంకాపురినీ ధ్వంసం చేస్తాను’ ఇది హనుమ జయధ్వానం. లంకాపురిలో సీతమ్మ జాడ తెలుసుకున్న అనంతరం ప్రాసాదం అధిరోహించి లంకేశ్వరుడి ఎదుట హనుమంతుడు (Hanuman) చేసిన హెచ్చరిక. చూసి రమ్మంటే కాల్చి వచ్చిన ఆంజనేయుడికి అక్కడికక్కడ లంకేశ్వరుడిని కొట్టడం పెద్ద లెక్కకాదు! రావణ సంహారం స్వామి కార్యమని తలచాడు హనుమంతుడు.
దుష్టశిక్షణ కోసం నారాయణుడు రాముడిగా అవతరించాడు ఆంజనేయుడు. రామచంద్రుడి అవతార ప్రయోజనాన్ని సిద్ధింపజేసే సంకల్పంతో రుద్రుడు.. హనుమంతుడిగా ఏతెంచాడు. వైశాఖ మాసం కృష్ణ పక్ష దశమిన మారుతి జన్మించాడని పరాశర సంహిత చెబుతున్నది. శివుడి అష్టమూర్తుల్లో ఒకటైన వాయుదేవుడి అనుగ్రహం ద్వారా కేసరి అనే వానర వీరుని భార్య అంజనాదేవికి తపః ఫలితంగా రుద్రతేజంతో హనుమంతుడు జన్మించాడు. కిష్కింధకాండ మొదలుకొని యుద్ధకాండ ముగిసే దాకా రామకార్యంలో కృతకృత్యుడు అయ్యాడు ఆంజనేయుడు. సీతమ్మ ఎడబాటుతో వేదన చెందుతున్న రాముడిని ఊరడించాడు. సముద్రాన్ని అవలీలగా దాటాడు. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాడు. వివిధ సందర్భాల్లో ఆంజనేయుడు మొత్తం తొమ్మిది అవతారాలు ధరించాడు. ఇవే హనుమన్నవావతారాలుగా ప్రసిద్ధి గాంచాయి. పరాశర సంహితలో ఇందుకు సంబంధించిన విషయాలన్నీ వివరంగా ఉన్నాయి.
హనుమంతడి తొమ్మిది అవతారాల్లో ప్రసన్నాంజనేయుడి అవతారం ఒకటి. మహాభారతంలో అర్జునుడి జైత్రయాత్రకు జెండాపై కపిరాజుగా ఉండేది ప్రసన్నాంజనేయుడు రూపమే. గంగానదిలో మునిగిపోయే ప్రమాదంలో చిక్కుకున్న మైందుడనే బ్రాహ్మణుడిని కాపాడేందుకు మారుతి ఎత్తిన అవతారమే వీరాంజనేయుడు. రామ ముద్రిక కోసం సాక్షాత్తూ బ్రహ్మదేవుడితో గొడవకు దిగాడు హనుమంతుడు. బ్రహ్మలోకాన్ని పెలిలించేస్తానంటూ 20 చేతులలో 20 ఆయుధాలు ధరించి ‘వింశతి భుజాంజనేయ’ అవతారంలో విశ్వరూపం చూపించాడు ఆంజనేయుడు. రావణుడి సంహారం కోసం సీతమ్మకు అండగా పోరాడుతూ ‘పంచముఖ’ అవతారం దాల్చాడు ఆంజనేయుడు.
దుర్వాస మహాముని తపస్సుకు సంతోషించిన ఆంజనేయుడు పద్దెనిమిది భుజాలతో ప్రత్యక్షమైన రూపం అష్టాదశ భుజ ఆంజనేయ అవతారం. ఇక కుండిన నగరంలో ధ్వజదత్తుడనే వేదవేదాంగవేత్తకు పేదరికాన్ని పోగొట్టిన మరో రూపమే ‘సువర్చలాంజనేయ’ అవతారం. కపిలుడనే పండితుడిని అనుగ్రహించడానికి హనుమంతుడు ‘చతుర్భుజ ఆంజనేయ’ అవతారం ధరించాడు. ఈ అవతారంలో ఆంజనేయ స్వామి పక్కన సువర్చలా దేవి ఉండటం మరో ప్రత్యేకత… హనుమంతుడి మరో అవతారం ‘ద్వాత్రింశత్ భుజ ఆంజనేయుడు’. 32 భుజాలతో మాహిష్మతి పాలకుడు సోమదత్తుడిని రక్షించాడు హనుమంతుడు. ఇక గాలుడనే బోయను కరుణించడానికి ‘వానరాకార ఆంజనేయ’ అవతారమెత్తాడు హనుమంతుడు.