jiletin stics
jiletin stics

Shanigakunta: నల్గొండ బాంబులా..సింగరేణివా ! ఏది నిజం?

  • శనిగకుంట మత్తడి పేల్చివేత ఘటనపై డీసీపీది ఓ మాట.. ఎమ్మెల్యేది మరోమాట
  • మంచిర్యాల జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్న చెన్నూర్ శాసన సభ్యుడి వీడియో
  • నిందితులు వీరేనంటూ పలువురి అరెస్టు చూపించిన పోలీసులు
  • అరెస్టయిన వారు అసలు నిందితులు కాదా అని అనుమానాలు
  • వివేక్ వెంకటస్వామి వీడియోతో కాంగ్రెస్ లో కలవరం

Shanigakunta: మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో శనిగకుంట మత్తడి బ్లాస్టింగ్ అధికార పార్టీని కలవరపాటుకు గురి చేసింది. ఈ బ్లాస్టింగ్ వెనుక అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత అసలు నిందితులకు మద్దతుగా ఉన్నాడనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. మీడియాలో వస్తున్న కథనాలతో పోలీసులు నిందితులు వీరేనంటూ పలువురిని అరెస్టు చేసి చూపించారు.ఈ బ్లాస్టింగ్ ఘటన ఇంతటితో ముగిసిపోయింది అనుకుంటున్న సయయంలో చెన్నూర్ ఎమ్మెల్యే విడుదల చేసిన వీడియో జిల్లాలో సంచలనంగా మారింది. అదే సయమంలో అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. మీడియా ముందు పోలీసులు చెప్పిందేమిటి.. ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి విడుదల చేసిన వీడియో ఏంటో వివరంగా తెలుసుకుందాం.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగకుంట చెరువు మత్తడిని గత నెల 16న అర్ధరాత్రి కొందరు పేల్చివేశారు. దీనిపై చెన్నూర్ ఇరిగేషన్ ఏఈ తిరుపతి గుర్తు తెలియని వ్యక్తులు మత్తడిని జిలెటిన్ స్టిక్స్ తో పేల్చి వేశారని అక్కడ దొరికిన ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై గత నెల 20వ తేదీన పెండ్యాల లక్ష్మీనారాయణ, భీం మధూకర్, రసమల్ల శ్రీనివాస్, గోగుల దానయ్యలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఫోన్ కాల్స్, బ్యాంకు స్టేట్ మెంట్ల ఆధారంగా మరికొందరిని అక్టోబర్ 3న సాయంత్రం మంచిర్యాల డీసీపీ భాస్కర్ చెన్నూర్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం పెట్టి అరెస్టు చూపించారు. ఇందులో నడిపెళ్లి లక్ష్మణ్ రావు, మంచాల రాజబాపు, పెద్దింటి శ్రీనివాస్, లక్కం రాజబాపు, పోగుల శేఖర్, ఇప్ప సంపత్, ఉమేష్ గిల్డా ఉన్నారు. పరారీలో ఉన్నవారిని శుక్రవారం తెల్లవారు జామున బస్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిలో బత్తుల సమ్మయ్య, రాంలాల్ గిల్డా, ఎన్నం బానయ్యల ఉన్నారని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ అక్టోబర్ 4న మీడియా సమావేశంలో వెల్లడించారు.

ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ(ఫైల్)
ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ(ఫైల్)

మత్తడి బ్లాస్టింగ్ చేసిన పేలుడు పదార్థాలు ఎక్కడివి?

శనిగకుంట మత్తడి పేల్చివేతకు ఉపయోగించిన జిలెటిన్ స్టిక్స్ ఎక్కడివి? ఎవరు తెచ్చారు. ఎలా తీసుకువచ్చారు. రవాణా ఎలా సాధ్యమైందని ప్రశ్నలు వెల్లువెత్తాయి. అయితే అక్టోబర్ 3న మంచిర్యాల డీసీపీ పేరిట మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో జిలెటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి తెచ్చారు. నిందితులు ఎవరనే వివరాలు వెల్లడించారు. ఈ జిలెటిన్ స్టిక్స్ నల్గొండ లో క్వారీలో ఉపయోగించేవిగా గుర్తించామని ప్రెస్ నోట్ లో స్పష్టంగా ఉంది. మరుసటి రోజు అక్టోబర్ 4న మరికొందరిని జైపూర్ ఏసీపీ అరెస్టు చూపించారు. ఏసీపీ విడుదల మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో నల్గొండ క్వారీలో బ్లాస్టింగ్ కు ఉపయోగించేవిగా గుర్తించినట్లు వెల్లడించారు.

MLA Vivek Venkataswamy
MLA Vivek Venkataswamy

ఎమ్మెల్యే వీడియోతో కలవరం..

పోలీసులు మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్లతో ఇక ఈ వివాదం సమసిపోయిందని అనుకుంటున్న తరుణంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి విడుదల చేసిన వీడియో మంచిర్యాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. చెన్నూర్ శనిగకుంట మత్తడి బ్లాస్టింగ్ లో ఉపయోగించింది సింగరేణి మైన్స్ లో వాడే పేలుడు పదార్థాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రిలీజ్ చేసిన వీడియోలో పేర్కొనడం గమనార్హం. ఈ వీడియో ప్రస్తుతం జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆ వీడియోలో ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. బాంబు బ్లాస్టింగ్ ఘటనలో లో కాంగ్రెస్ నేతలను కాపాడతున్నానని కొందరు ఆరోపించారన్నారు. అయితే శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఏ స్థాయి వ్యక్తి అయినా జోక్యం చేసుకోవడానికి వీలు లేదని స్పష్టం చేశాడు. పోలీసు శాఖ శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు.

ఇదిలా ఉండగా ఎమ్మెల్యే చెబుతున్న విషయాలు సబబుగానే ఉన్నాయని, అసలు శనిగకుంట మత్తడి బ్లాస్టింగ్ కు ఉపయోగించిన పేలుడు పదార్థాలు సింగరేణి నుంచి ఎలా తెచ్చారు., ఎవరు తెచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సింగరేణి నుంచి ఈ బాంబులు బయటకు రావడం అంత సులభం కాదని పలువురు పేర్కొంటున్నారు. చెన్నూర్ మత్తడి పేల్చి వేతకు అంత సులభంగా పేలుడు పదార్థాలు తెచ్చిందెవరనే చర్చ నడుస్తున్నది. పేల్చివేతకు ఉపయోగించింది సింగరేణి బాంబులని స్వయంగా ఎమ్మెల్యేనే ఈ విషయం చెప్పడం మరింత అనుమానాలకు తావిస్తున్నది. అసలు వ్యక్తి తప్పించుకున్నాడా? లేక తప్పించారా? లేదా పోలీసులు త్వరలో అరెస్టు చూపుతారా అనే చర్చ సాగుతున్నది. చెరువు బఫర్ జోన్లో మట్టి పోసిన ఒక కాంగ్రెస్ నాయకుడి దగ్గరి బంధువు, జిల్లాలోని ఓ ఓసీపీలో పని చేస్తున్నట్లు పలు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. కానీ సింగరేణి అధికారులు మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సింగరేణిలో అంతర్గతంగా ఏమైనా విచారణ జరుగుతున్నదా? దీనిని ఇక్కడితోనే సద్దుమణిగించే ప్రయత్నాలు సాగుతున్నాయా? ఎమ్మెల్యే వీడియో విడుదల చేయడం వెనుక మతలబు ఏమిటనే చర్చ జోరందుకుంది.

వివరాలు వెల్లడిస్తున్న జైపూర్ ఏసీపీ
వివరాలు వెల్లడిస్తున్న జైపూర్ ఏసీపీ

పేల్చివేతకు ఉపయోగించిన జిలెటిన్ స్టిక్స్ ఎన్ని..?

పోలీసులు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో IDEAL POWER-90 కంపెనీకి చెందిన 25గ్రాముల పరిమాణం గల జిలెటిన్ స్టిక్స్ అని పేర్కొన్నారు. కానీ ఎన్ని ఉపయోగించారనే విషయం మాత్రం వెల్లడించలేదు. కానీ పేల్చని నాలుగు జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా మీడియా సమావేశంలో చూపించారు. చెరువు మత్తడి పూర్తి విస్తీర్ణం 44 మీటర్లు కాగా 39 మీటర్ల మత్తడి పేల్చేశారు.కాగా, నిందితులు ఎన్ని బాంబులు ఉపయోగించారనేది మాత్రం ఎందుకు వెల్లడించలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు మాత్రం నల్గొండ నుంచి పేలుడు పదార్థాలు తీసుకువచ్చారని చెబుతున్నారు. కానీ అంత దూరం నుంచి పేలుడు పదార్థాల రవాణా ఎలా సాధ్యమైందనే ప్రశ్నలు వెల్లువెత్తుతుండగా, ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి విడుదల చేసిన వీడియో అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నది. ఈ పేల్చివేత కేసు విచారణ ఇక్కడితోనే ముగుస్తుందా? మరికొంత మందిని అరెస్టు చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?పేల్చివేతకు ఉపయోగించింది సింగరేణి బాంబులు అని ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి చెప్పిన దానిపై పోలీసులు మరింత విచారణ ఏమైనా జరుపుతారో లేదో వేచి చూడాల్సిందే.

– శెనార్తి మీడియా, మంచిర్యాల:

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *