Macherial layouts
Macherial layouts

Land Registrations: నాన్ లేఅవుట్… ఫుల్ బెనిఫిట్

  • ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో నిబంధనలకు పాతర
  • దర్జాగా నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు
  • ప్రతిఫలంగా ప్లాట్ లెక్కన వసూళ్లు
  • కొన్నిచోట్ల ఏకంగా బినామీల పేరిట ప్లాట్ల రిజిస్ట్రేషన్
  • రిజిస్ట్రేషన్ శాఖలో తమ రూటే సప’రేటు’
  • అనే రీతిలో కొందరు అధికారుల తీరు
  • నోటీసులు ఇచ్చిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు
  • ఒత్తిడితో సతమతవుతున్న అధికారులు

 

శెనార్తి మీడియా, మంచిర్యాల:

Land Registrations : అక్రమార్జన కోసం మంచిర్యాల జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొందరు తమ రూటే సప’రేటు’ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. అందిన కాడికి దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని అడ్డదారుల్లో ముందుకు సాగుతున్నారు. ప్లాట్లు, ఇండ్లు, లీజు, రెంట్, మార్టిగేజ్, ఇతర రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ నిబంధనలు విస్మరిస్తున్నారు. తాము చేసే పనుల్లో కొన్నింటికి భారీ నజరానాలు సైతం అందుకుంటున్నారు. నవ్విపోదురు గాక మాకేంటి… అనే ధోరణిలో ముందుకెళ్తున్నారు. ప్రధానంగా నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో పెద్ద మొత్తంలో ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. నాన్ లేఅవుట్ ప్లాట్లలో విలువను బట్టి రేట్ ఫిక్స్ చేసి ప్లాటుకు ఇంత అని వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎక్కువ మొత్తంలో ప్లాట్లు గల కొన్ని వెంచర్లలో ప్లాటు టు ప్లాటు లెక్కన డబ్బులు తీసుకునే బదులు ఒక ప్లాట్ నే తమ బినామీ పేర రిజిస్ట్రేషన్ చేయిస్తున్న ఉదంతాలూ లేకపోలేదు. పలు మండలాల్లో ఈ తతంగం జరిగినట్లు ప్రభుత్వ నిఘా విభాగాల దృష్టికి వచ్చినట్లు సమాచారం.

మొత్తానికి ఇక్కడ నాన్ లేఅవుట్.. నాలా ఉన్నా వాటికీ.. ఫుల్ బెనిఫిట్ అనే నినాదంతో దందా నడుస్తుందన్న చర్చ జోరుగా సాగుతున్నది. ఇక కోర్టు కేసులో ఉన్న స్థలాలకూ ఇంటి నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసి పెద్ద మొత్తంలో ఆర్థికంగా లాభం పొందుతున్నారు. ఇవన్నీ కూడా ఆఫీసులో అన్నీ తానై వ్యవహరిస్తున్న తమ బాస్ అనుమతితో నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా నాన్ లేఅవుట్ ప్లాట్లు, నాలాను రిజిస్ట్రేషన్ చేశారని, అందులో నాలా కన్వర్షన్ చేసిన ఒక డాక్యుమెంట్ భూమిని భాగాలుగా రిజిస్ట్రేషన్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై కొద్దిరోజుల క్రితం మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, లక్షెట్టిపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలోని హాజీపూర్ మండలం హాజీపూర్, డోనబండలో, లక్షెట్టిపేట మండలంలోని లక్షెట్టిపేటలోని లక్ష్మీపూర్, సూరారం, అంకత్పల్లి, శాంతపూర్ గ్రామాల్లో జోరు వెంచర్లు వెలిశాయి. అటు నస్పూర్, జైపూర్, భీమారం, చెన్నూర్ లోనూ ఇదే తంతు జరుగుతున్నది. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్లు జోరుగా నాన్ లేఅవుట్లను రిజిస్ట్రేషన్లు చేస్తుండడం గమనార్హం. ఇక్కడ ఇంత జరుగుతున్నా నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై ఈ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? చూసీచూడనట్లు వదిలేస్తారా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

భారీగా వసూళ్లు..

మంచిర్యాల, లక్షెట్టిపేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్ తరహాలో అభివృద్ధి దిశలో పయనిస్తున్నది. ప్రధానంగా మంచిర్యాల రోజురోజుకూ విస్తరిస్తుండడంతో ఈ కార్యాలయాల పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 18 మండలాల్లో నూతనంగా వెంచర్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. రియల్టర్లు కొందరు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి నాలా కన్వర్షన్ చేయడం ద్వారా వెంచర్లుగా మార్చుతున్నారు. లేఅవుట్ చేయకుండానే ఈ వెంచర్ల లోని నాన్ లే అవుట్ ప్లాట్లను విక్రయిస్తున్నారు. “ప్రభుత్వ నిబంధన ప్రకారం వీటిని రిజిస్ట్రేషన్ చేయరాదు. అయితే రియల్టర్లు కొందరు తమ వెంచర్లలో నాన్ లేఅవుట్ ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు. అంతా నేనే రీతిలో వ్యవహరిస్తున్న సదరు బాస్ తో డీల్ కుదుర్చుకుంటున్నారు. డీల్ సెట్ కాగానే ప్లాట్ లెక్కన ముడుపులు ముట్టజెబుతూ నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ప్లాటుకు రూ.30 వేల నుంచి మొదలవుతుంది. ప్లాట్ విలువను బట్టి ఆ రేటు పెరుగుతుందనే చర్చ కూడా నడుస్తున్నది. ఏది ఏమైనా ఈ దందాలో ధనం పెద్ద మొత్తంలో చేతులు మారుతుందనేది బహిరంగ రహస్యం. మంచిర్యాల, లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాల పరిధిలోని పలు వెంచర్లలో జరిగినట్లు ఈ తతంగం నడిచినట్లు తెలిసింది.

mncl venture
mncl venture
ఏకంగా ప్లాట్ల కైవసం

నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో అన్నీ తానై వ్యవహరించిన వ్యక్తి .. బాస్ అనుమతితో కొన్ని వెంచర్లలో ప్లాట్లను పొంది బినామీల పేరిట రిజిస్ట్రేషన్  (Land Registrations) చేసుకున్నట్లు తెలుస్తున్నది. నాన్ లేఅవుట్ ప్లాట్లు గల పలు పెద్ద వెంచర్లలో ఈ ఘటనలు జరిగినట్లు సమాచారం. ఆయా వెంచర్లలోని నాస్ లేఅవుట్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తే, ప్లాట్ కి ఇంత అని సమర్పించుకునే ముడుపులకు బదులు అంత విలువచేసే ఓ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ల విషయంలో శాఖలో తమకు సహకరించిన వారి బినామీల పేరిట సంబంధిత రియల్టర్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. పలు మండలాల్లో ఇలా జరిగిందని ప్రభుత్వ నిఘా విభాగాలకు అందిన ఫిర్యాదులో ఉన్నట్లు సమాచారం. ఇలా బినామీల పేరిట ప్లాటు రిజిస్ట్రేషన్ జరిగిన వెంచర్లను కూడా అందులో పేర్కొన్నట్లు సమాచారం. అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా పొందిన ఈ ఒక్కో ప్లాట్ విలువ రూ.లక్షల్లో ఉంటుందని తెలుస్తున్నది. నాన్ అవుట్ ప్లాట్ల అక్రమ రిజిస్ట్రేషన్లు, వీటిని రిజిస్ట్రేషన్ చేసినందుకు చేతులు మారిన ముడుపులు, ఆమ్యామ్యాల కింద కొన్ని వెంచర్లలో ఏకంగా బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్ల విషయమై నిఘా విభాగాలు తమ నెట్ వర్క్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నాన్ లే అవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయమై శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

త్వరపరండి ఫ్రీ లాంచింగ్ ఆఫర్… కొద్దిరోజులు మాత్రమే
ప్రతి వెంచర్లో ఇదే తంతు..
broucher
broucher

మంచిర్యాల రెవెన్యూ డివిజన్లో నాన్ లేఅవుట్ ప్లాట్లకు బాగా డిమాండ్ ఉంది. ఆఫర్ల పేరుతో కొందరు రియల్టర్లు కేవలం రూ. 51వేలు కడితే చాలు గ్రాము బంగారం ఇస్తామంటూ ఆఫర్లు పెడుతున్నరు. కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలను ఆసరాగా చేసుకొని ప్రజలను మభ్యపెట్టి నాన్ లే అవుట్ ప్లాట్లను అమ్ముతుండడం గమనార్హం. ఇది ఇలా ఉంటే జిల్లాలో పంట భూములకు రేట్లు కట్టి… రైతులతో బేరసారాలు చేసుకొని భూములని రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. ఇదంతా అటు మండల కేంద్రంలోని మండల కార్యాలయంలో జరుగుతుండడం కొసమెరుపు. మండలంలో నాలా కన్వర్షన్ చేయించడం … సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్లాట్ల చొప్పున రిజిస్ట్రేషన్ జరుగుతున్నా ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో రియల్టర్లు ఆడిందే ఆట. పాడిందే పాటగా మారింది. మరి ఆ శాఖలోని ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటరా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

వసూళ్ల పర్వమే లక్ష్యంగా..

వసూళ్ల పర్వమే లక్ష్యంగా పెట్టుకొని అధిక మొత్తంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ, ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక్కో ధర నిర్ణయించి.. అవి చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని… లేని పక్షంలో పెండింగ్ లో పెట్టడం ఇక్కడ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమని పలువురు ప్రజలు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏడు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా, ప్రతిచోటా ఇన్చార్జీల పెత్తనమే కొనసాగుతున్నది. ఇది ఇలా ఉంటే ఉమ్మడి జిల్లాకు మేజర్ సెంటర్ గా మంచిర్యాల నిలవడం గమనార్హంజ రెగ్యులర్ సబ్ రిజిస్ర్టార్ లేకపోడం తో ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లు చెప్పిన విధంగా అధికారులు నడుచుకోవడం కొసమెరుపు. రెగ్యులర్ గా వచ్చిన వారు మూణ్నాళ్ల ముచ్చటగా రిజిస్ట్రేషన్లు చేయడం, లాంగ్ లీవ్ లో వెళ్లడం సర్వ సాధారణంగా మారింది. అసలు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ ను మంచిర్యాల జిల్లాకు ఎందుకు నియమించడం లేదు..? వచ్చిన వారు ఎందుకు నిలకడగా ఉండడం లేదు. లేక వసూళ్ల కోసమే ఇక్కడికి వచ్చి లాంగ్ లీవులు పెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాలలో రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్న వాటిపై అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారా..? లేదా తూ..తూ.. మంత్రంగా చూస్తున్నారా..? అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

mncl venture
mncl venture
ఆదేశాలు బేఖాతరు

ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు చేయడంలోనూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ ముందు వరుసలో ఉంటున్నది. తన పరిధిలో ఉన్న కార్యాలయంలో ఇంత జరుగుతున్న జిల్లా రిజిస్ర్టార్ మాత్రం తెలియదా? లేక మధ్యవర్తి మేనేజ్ చేస్తున్నాడా? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారులు మౌనం…?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు తమ హవాను కొనసాగిస్తూ…ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఏ మాత్రం స్పందించక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు ఏకంగా జూనియర్ అసిస్టెంట్ సీటు పక్కనే ఉండి వారి పత్రాలు చేయించడం అధికారులకు ఏమాత్రం కనిపించకపోవడం మరీ శోచనీయం. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోకపోవడంపై ఆ శాఖ ఉన్నతాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

mncl venture1
mncl venture1

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *