ఆర్ఎంపీ వైద్యమే కారణమా…?
RMP Treatment: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్త కొమ్ముగూడెం (కొర్వి చెల్మ) గ్రామంలో ఇంజక్షన్ వికటించి బత్తుల మధుకర్ (26) అనే యువకుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. దండేపల్లి మండలం కొత్త కొమ్ముగూడెం (కొర్వి చెల్మ) గ్రామానికి చెందిన బత్తుల మధుకర్ ది వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించుకునే ఓ సాధారణ రైతు కుటుంబం. ఇటీవల మధుకర్ కు జ్వరం రావడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానలో పరీక్షలు చేయించుకున్నాడు. డెంగ్యూ జ్వరం తెలియడంతో ఓ ఆర్ఎంపీ వద్ద ఇంజక్షన్ వేసుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాల లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అతనికి బ్రెయిన్ లో సమస్యలు వచ్చాయని వైద్యులు తెలిపారు. వెంటనే అతడిని సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తీసుకెళ్లారు. మధుకర్ కోమాలోకి వెళ్లాడని చెప్పిన వైద్యులు ఐఎన్‌సీయూలో ఉంచి చికిత్స చేశారు. మధుకర్ కు అక్కడ వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వారం నుంచి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మంగళవారం చనిపోయాడు. దీనంతటికి కారణం ఆర్ఎంపీ శ్రీనివాస్ వేసిన ఇంజక్షన్ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనర్హులైన ఆర్ఎంపీలను కట్టడి చేస్తామని చెబుతున్న అధికారులకు ఇలా ఇంకెంత మంది ప్రాణాలు పోయే వరకు చూస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల