రికవరీ పేరుతో ఇంటి తలుపులు తీసుకెళ్లిన సిబ్బంది
Bank Loan: తీసుకున్న రుణం చెల్లించలేదని బ్యాంకు సిబ్బంది రికవరీ కోసం వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారు. రుణం తీసుకున్న రైతు ఇంటి తలుపులు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన సంఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో కలకలం రేపింది.
నెన్నెల మండల కేంద్రంలోని నేతకాని వాడకు చెందిన గట్టు శివ లింగయ్య, అతని సోదరుడు భానేష్ డీసీసీబీ బ్యాంకులో రూ.3 లక్షలు అప్పు తీసుకున్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు సదరు రైతుల ఇంటి వద్దకు వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డారు. బకాయిలు చెల్లిస్తామని ఓ వైపు రైతులు వేడుకుంటున్నా అధికారులు ససేమిరా అన్నారు. చెల్లించాల్సిన సొమ్మును సెటిల్ మెంట్ చేసిన తర్వాత వెళ్తామని గొడవ చేశారు. అంతటితో ఆగకుండా అప్పుల కింద ఇంటి తలుపులు తీసేసి హంగామా చేశారు. ఈ క్రమంలో చుట్టుపక్కల ప్రజలు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. డబ్బులు ఇస్తామని చెప్పినా బ్యాంకు ఉద్యోగులు ఇళ్ల తలుపులు తీసుకెళ్లేందుకు యత్నించడంతో రైతులు ఉలిక్కిపడ్డారు. మీరు అప్పు చెల్లించినప్పుడు తీసుకోండి. ఇవ్వకుంటే గడువు ఇవ్వాలి. అంతేకాదు అప్పులపాలై ఇల్లు తీసుకునే హక్కు మీకు ఎక్కడిదంటూ స్థానికులు వారిపై మండిపడ్డారు. దీంతో బ్యాంకు అధికారులు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన బ్యాంకర్ల చర్యపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బ్యాంకుల్లో కోట్ల రూపాయల అప్పులు చేసిన పెద్దమనుషులు ఎందరో ఉన్నారన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన పేద రైతులు చెల్లింపులో కాస్త ఆలస్యమైతే ఇలా దౌర్జన్యానికి దిగుతారా అని మండిపడ్డారు. బ్యాంకు సిబ్బందికి ఎంత నచ్చజెప్పినా వినకుండా ఇంటి తలుపులు పగులగొట్టారు. ఇది ప్రభుత్వ బ్యాంకర్లకు తగునా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. బ్యాంకర్ల అనుచిత ప్రవర్తనతో ప్రజల ఆగ్రహం చేశారు. అప్పుల వసూళ్లు ఇలాగే ఉంటాయా అంటూ బ్యాంకర్ల తీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు. అప్పుల వసూళ్ల కోసం రైతులపై బ్యాంకర్లు చూపుతున్న ప్రతాపానికి గ్రామస్తులు మండిపడుతున్నారు. రైతులపై బ్యాంకర్ల చూపుతున్న ప్రతాపంపై జిల్లాలో జోరుగా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
-శెనార్తి మీడియా, మంచిర్యాల