chennur politics
chennur politics

Chennur Politics : చెన్నూర్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ దారెటు..?

అధికారంలో ఉండి ఎమ్మెల్యేను కలవడంలో అంతర్యం ఏమిటి..?

శెనార్తి మీడియా, మంచిర్యాల :

Chennur Politics :  మంచిర్యాల జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా  మారుతున్నాయి. మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న లీడర్లు   ఇప్పుడు  కండువాలు మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.   మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రస్తుతం పదవిలో ఉన్న మున్సిపల్ చైర్ పర్సన్ భర్త రామ్ లాల్, వైస్ చైర్మన్ నవాజుద్దీన్ హైదరాబాదులోని స్థానిక ఎమ్మెల్యే నివాసంలో సమావేశం అవడం వెనుక అంతర్యం ఏమిటని పట్టణ ప్రజలు గుసగుసలాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత  నలుగురు కౌన్సిలర్లు పార్టీ మారారు.  మరి కొంతమంది కౌన్సిలర్లు పార్టీ మారే దిశగా పావులు కదుపుతున్నారు. ఇదే క్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భర్త, వైస్ చైర్మన్  పార్టీలు మారే ఆలోచనతో ఎమ్మెల్యే తో సమావేశమయ్యారనే వార్త  పట్టణంలో చర్చనీయాంశమైంది.

చెన్నూరు మేజర్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయిన తర్వాత పాలకమండలిలో సరైన నాయకత్వం లేకపోవడంతో మునిసిపాలిటీ లో అవినీతి అక్రమాలకు తావు లేకుండా పోయిందని, గత ప్రభుత్వ హయాంలో తై బజార్ వేలం టెండర్లలో గాని, లావొని పట్టా భూములలో అక్రమ కట్టడాలుగాని, అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయించడంలో గాని, చెత్త ఆటోల మరమ్మతుల పేరిటగాని ఎన్నో విధాలుగా మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని అందులో ప్రమేయం ఉన్న నాయకులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజావాణిలో, కలెక్టర్ కు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేశారు. గత ప్రభుత్వంలో అక్రమార్కులైన నాయకులపై చర్యలు లేకపోవడంతో విసిగిపోయిన కాంగ్రెస్ నాయకులు తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అనుకుంటున్న సందర్భంలో చైర్మన్ భర్త, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అవినీతిలో ప్రమేయం ఉన్న నాయకులను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటే రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని పార్టీల్లోని ద్వితీయ శ్రేణి వర్గం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సదరు నాయకులతో ఎమ్మెల్యేతో సమావేశం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక ముఖ్య నాయకుని హస్తముందని పార్టీలోని మరో వర్గం గుసగుసలాడుతున్నది.  ఏది ఏమైనప్పటికీ స్థానిక ఎన్నికల ముందు పట్టణంలో రాజకీయం రసవత్తరంగా మారబోతుంది. అభివృద్ధికి సహకరించమని ఎమ్మెల్యేను హైదరాబాద్ లో ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నామని మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్ (Nawazuddin) తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *