Modi 3.0 : 2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమమైంది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో పాటు ప్రధాని మోదీ కొత్త టీమ్‌లో గత ప్రభుత్వంలోని పలువురు మంత్రులకు మళ్లీ చోటు దక్కుతుందనే చర్చ కూడా జరుగుతోంది. రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, మన్‌సుఖ్ మాండవియా, అనుప్రియా పటేల్, జి కిషన్ రెడ్డిలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. మోడీ 3.0 ప్రభుత్వ కొత్త జాబితా ఇలా ఉండనున్నట్లు తెలుస్తున్నది.
ప్రధాని మోదీ కొత్త మంత్రివర్గం
ఓ వైపు ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు.. కొందరు ఎంపీలను ప్రధాని సమావేశానికి పిలిచారు. ప్రధాని మోదీ ఈ భేటీలో ఉన్న ఎంపీలకు కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కడం ఖాయమని చెబుతున్నారు. దీంతో మోడీ తన పాత జట్టులోని మంత్రులకు కొత్త ప్రభుత్వంలో ఎవరికి అవకాశం కల్పిస్తారోననే ఆసక్తినెకొంది.
అమిత్ షా
బీజేపీ మాజీ అధ్యక్షుడు, మోడీ 2.0 ప్రభుత్వంలో హోంమంత్రిగా చేసని అమిత్ షా మరోసారి కొత్త ప్రభుత్వంలోనూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త ప్రభుత్వంలో షాకు చోటు దక్కడం ఖాయం. ప్రధాని మోదీతో కాబోయే మంత్రుల సమావేశంలో కూడా షా పాల్గొంటున్నారు.
రాజ్‌నాథ్ సింగ్
గత ప్రభుత్వంలో బీజేపీ సీనియర్ నాయకుడు, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మోడీ 3.0 ప్రభుత్వంలోనూ చోటు దక్కడం ఖాయమని తెలుస్తున్నది. 2014లో మోదీ కేబినెట్‌లో రాజ్‌నాథ్ సింగ్ కూడా చేరారు.
నితిన్ గడ్కరీ
బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తున్నది. మోదీ 2.0 ప్రభుత్వంలో గడ్కరీకి రోడ్డు, రవాణా, హైవే మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. మరి ఈసారి ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి.
పీయూష్ గోయల్
పీయూష్ గోయల్ మరోసారి మంత్రి కావడం ఖాయమనే సంకేతాలు ఉన్నాయి. 2019లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వాణిజ్యం, జౌళి, వినియోగదారుల వ్యవహారాలు వంటి శాఖల బాధ్యతలు చూశారు. మరి కొత్త ప్రభుత్వంలో ఆయనకు ఎలాంటి బాధ్యతలు దక్కుతాయో చూడాలి.
అర్జున్ రామ్ మేఘవాల్
మంత్రుల జాబితాలో అర్జున్ రామ్ మేఘవాల్ పేరు కూడా ఉంది. ఆయన బీజేపీలో సీనియర్ నాయకుడు. బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచి ఎంపీ అయ్యారు. మోదీ 2.0 ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
జ్యోతిరాదిత్య సింధియా
మోడీ 3.0 కేబినెట్‌లో జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రి పదవి దక్కడం దాదాపు ఖాయం. సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. మోదీ 2.0 ప్రభుత్వంలో ఆయనకు పౌర విమానయాన, ఉక్కు మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు.
మన్సుఖ్ మాండవియా
మోడీ 2.0 ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన్సుఖ్ మాండవియాకు కొత్త ప్రభుత్వంలో చోటు దక్కడం ఖాయం. మరి ఈసారి ఎలాంటి బాధ్యతలు స్వీకరిస్తాడో చూడాలి.
అనుప్రియా పటేల్
అనుప్రియ పటేల్ మరోసారి మంత్రి కావడం ఖాయం అని భావిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఏర్పాటైన రెండు ప్రభుత్వాల్లోనూ ఆమె మంత్రి పదవులు చేపట్టారు. మోడీ 3.0లో ఆయనకు మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చు.