Modi Oath taking : ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. దీని తరువాత, ఎన్డీఏ ప్రతినిధి బృందం రాష్ర్టపతి ద్రౌపది ముర్మును కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని మద్దతు లేఖను సమర్పించింది. అనంతరం రాష్ట్రపతి కూడా మోడీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. జూన్ 9న సాయంత్రం 07.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి మండలి సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
విదేశాల నుంచి అతిథులకు ఆహ్వానం
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్, సీషెల్స్ అధ్యక్షుడు వేవెల్ రాంఖేలావన్‌లను కూడా ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని భారత్ ఆహ్వానించింది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. దహల్ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు.
ఢిల్లీలో మూడంచెల భద్రత
మోదీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఢిల్లీలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌కు రక్షణగా ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) కమాండోలు, డ్రోన్లు, స్నిపర్‌లను మోహరించనున్నారు. పలువురు విదేశీ నేతలు కూడా ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని మొత్తం ఫుల్ సెక్యూరిటీతో హైఅలర్ట్‌గా ఉంటుంది. ప్రమాణ స్వీకారాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు జూన్ 9, 10 తేదీల్లో పలు ఆంక్షలు కూడా విధించారు. ఢిల్లీని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు.
హై సెక్యూరిటీ జోన్‌లో ప్రవేశానికి నో
మోదీ ప్రమాణ స్వీకారాన్ని దృష్టిలో ఉంచుకుని విదేశీ అతిథుల భద్రత బాధ్యత కూడా దేశ నిఘా సంస్థదే. ప్రమాణ స్వీకార తేదీ ప్రకటించిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. హై సెక్యూరిటీ జోన్‌లో సాధారణ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. రాష్ట్రపతి భవన్ తో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు మరింత పెంచారు. ఆ ప్రాంతం గుండా వెళుతున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
హోటళ్లలోనూ సోదాలు
విదేశీ అతిథుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారు బస చేసే హోటళ్లపైనా విచారణ ప్రారంభించారు. ప్రమాణస్వీకారానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉండడంతో విదేశీ అతిథుల బసకు, వారి భద్రతకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు వివిధ ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా అత్యవసరం లేదా ముప్పు వాటిల్లితే పర్యవేక్షించడానికి, సమాచారం అందించడానికి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరిస్తున్నారు.