- పార్లమెంట్ ఫలితాలపై బీజేపీ పోస్ట్‌మార్టం
- జూలై నెలఖారులో సమావేశాలు
- సంస్థాగత మార్పులపై చర్చలు
- హాజరు కానున్న అగ్రనేతలు మోడీ, షా, నడ్డా
- బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు
BJP Internal Changes: 2024 లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ మార్కును అందుకులేకపోయిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రస్తుతం తనలోని లోపాలను వెతుక్కుంటున్నది. యూపీతో సహా కొన్ని పెద్ద రాష్ట్రాల్లో పేలవమైన పనితీరును పార్టీ నిశితంగా పరిశీలిస్తున్నది. అలాగే ఓటమికి కారణాలను మేధోమథనం చేయబోతోంది. ఈ సమావేశానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా హాజరు కానున్నారు. అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. జూలై నెలాఖరులో బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మేధోమథనం
జూలై నెలాఖరులో జరగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నట్లు సమాచారం. దీనితో పాటు ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయంపైనా చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం- డిప్యూటీ సీఎంలు హాజరుకానున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకే పరిమితమైందని భావిస్తున్నారు. అయితే, ఎన్డీయే కూటమి మెజారిటీ మార్కును దాటడంతో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. అయితే, పార్టీ పేలవమైన పనితీరుపై బీజేపీ అగ్ర నాయకత్వానికి కునుకుపట్టడం లేదు. ముఖ్యంగా యూపీ లాంటి ప్రధానమైన రాష్ట్రంలో ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది.
పార్టీ వెనుకబాటుపై చర్చలు
లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ చాలా సీట్లు కోల్పోయిన తీరు అక్కడి రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదివారం లక్నోలో జరిగిన యూపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరిలను ఢిల్లీకి పిలిచారు. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేశవ్ మౌర్య, భూపేంద్ర చౌదరి వేర్వేరుగా భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల తగ్గింపు, యూపీలో భవిష్యత్తు వ్యూహంపై ఇరువురు నేతలతో నడ్డా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.
యూపీలో కొనసాగుతున్న సమావేశాలు
యూపీ బీజేపీలో అంతర్గత పోరు ఒక్కటే కాదు. అంతకుముందు సీఎం యోగి నేతృత్వంలో జరిగిన రెండు కేబినెట్ సమావేశాలకు గైర్హాజరైన కేశవ్ మౌర్య దాదాపు 20 రోజుల పాటు మౌనం పాటించారు. గత ఆదివారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మౌనం వీడారు. ప్రభుత్వం కంటే పార్టీనే తమకు ముఖ్యమని ఈ సమావేశంలో కేశవ్ ఉద్ఘాటించారు. తాను ముందు బీజేపీ కార్యకర్తనని, ఆ తర్వాతే డిప్యూటీ సీఎంనని చెప్పారు. ఆ తర్వాతే ఆయనను ఢిల్లీకి పిలిపించారు. అయితే, ఇప్పుడు బీజేపీ నాయకత్వం అన్ని రాష్ట్రాల సీఎం-డిప్యూటీ సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో తదుపరి వ్యూహంపై చర్చించనున్నారు.
జూలై నెలాఖరులో సీఎం-డిప్యూటీ సీఎం భేటీ
యూపీ సహా వివిధ రాష్ట్రాల్లోని లోపాలను, సానుకూల అంశాలను బీజేపీ కేంద్ర నాయకత్వం అర్థం చేసుకోవాలని భావిస్తున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యూపీలో కూడా పార్టీ కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిని దృష్టిలో ఉంచుకుని, వివిధ సలహాలను కోరింది. త్వరలోనే పార్టీ అధిష్టానం తగిన చర్యలు తీసుకోవచ్చని భావిస్తున్నారు.