Mncl accident
Mncl accident

Mancherial: కాంపౌండ్ వాల్ కూలి ముగ్గురి మృతి

శెనార్తి మీడియా, మంచిర్యాల :

Mancherial: కూలీ పనుల కోసం పొరుగు జిల్లా నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులు మృత్యువాత పడ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భవన నిర్మాణ సమయంలో కాంపౌండ్ వాల్ కూలిన ఘటనలో ముగ్గురు కూలీలు చనిపోగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుది. వివరాలిలా ఉన్నాయి.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో నందిని హాస్పిటల్ కు వెనకాల వారిదే మరో భవనం నిర్మాణం చేపట్టారు. గురువారం సెల్లార్ ఫిల్టర్ నిర్మాణ పనులు చేస్తున్నారు. 12 ఫీట్ల లోతు నుంచి పిల్లర్ పనులు ఎనిమిది మంది కార్మికులు చేస్తున్నారు. ఒకరి వెనుక మరొకరు పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పక్క ఇంటి ప్రహరీ కూలింది. అప్పటికే నలుగురుపైకి వెళ్లారు. మైదం రామన్న పైకి ఎక్కుతున్నారు. రామన్నకు గాయాలు కాగా ఆత్రం శంకర్, ఎనంక హన్మంతు, గోలెం పోశంల అందులోనే ఉన్నారు. గోడ అంతా కూలి వారిపై పడడంతో ఊపిరి ఆడక చనిపోయారు. వీరు ఈ పనిని నాలుగు రోజులుగా చేస్తున్నారు. చనిపోయిన వారంతా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాపూర్, రుద్రాపూర్ గ్రామస్తులు. గాయాలపాలైన రామన్న గుడ్లబోరి (కౌటాల మండలం) వాసి. బతుకుదెరువు కోసం మంచిర్యాలకు వచ్చి పట్టణంలోని భగవంతంవాడ, రాజీవ్ నగర్‌లో నివాసముంటు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మృతదేహాలను మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించే క్రమంలో బంధువులు అడ్డకున్నారు. దవాఖాన యాజమాని చంద్రయ్య ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ముగ్గురు మృతి చెందారని బాధితుల ఆంబులెన్సులను అడ్డుకున్నారు. బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టగా పోలీసులు నచ్చజెప్పి పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు. మరోవైపు అసలు భవనం, సెల్లార్ నిర్మాణానికి అనుమతి ఉందా..! లేదా..! అనేది మున్సిపల్ అధికారులకే తెలియకపోవడం గమనార్హం.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రుద్రాపూర్ కు చెందిన ఎనంక హన్మంతు (45) మంచిర్యాలలోని భగవంతం వాడలో అద్దెకు ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కూతురు పెండ్లి వివాహనం నిశ్చమైంది. మరో నెలలో పెళ్లి ఉంది. పెళ్లికి డబ్బులు ఉపయోగపడుతాయనే సమయంలో ఇలా మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంటిలో చావు డప్పు మోగుతుందంటూ రోదించిన తీరు అక్కడి వారిని కలిచి వేసింది. బాబా పూర్ కు చెందిన గోలం పోశు (48) మంచిర్యాలలోని రాంనగర్ లో ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన శంకర్ ఆత్రం (42) మందమర్రిలో ఉంటున్నాడు. ముగ్గురి మృతితో భగవంతంవాడ, రాంనగర్, మందమర్రితో పాటు వారి సొంతూళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని రామగుండం సీపీ శ్రీనివాసులు, మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహుల్, మంచిర్యాల ఆర్డీవో రాములు, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ తోపాటు సీఐలు, ఎస్సైలు పరిశీలించారు.

దర్యాప్తు చేపడుతున్నాం: శ్రీనివాసులు, రామగుండం సీపీ

కాంపౌండ్ వాల్ కూలి ముగ్గురు మృతి చెందిన విషయం తెలుసుకున్న రామగుండం సీపీ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని వేడుకోవడంతో దర్యాప్తు జరిపి న్యాయం చేస్తామని సీపీ హామీ ఇచ్చారు. ఈ భవన నిర్మాణానికి అనుమతి ఉందా, లేదా! అనే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదం జరిగిందని, జాగ్రత్తలు తీసుకొని ఉంటే ప్రాణాలు పోయేవి కాదన్నారు. అనంతరం దవాఖానలో గాయాలతో ఉన్న క్షతగాత్రుడిని పరామర్శించారు.

సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం : జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బీ రాహుల్

గోడ కూలి ముగ్గురు మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బీ రాహుల్ స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని మంచిర్యాల ఆర్డీవో వీ రాములు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ లతో కలిసి పరిశీలించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన ఇంటి నిర్మాణం చేస్తున్న సమయంలో పక్కన ఉన్న ఇంటికి సంబంధించిన ప్రహరీ కూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అదనపుల కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు హామీ ఇచ్చారు.

స్పందించని మున్సిపల్ కమిషనర్

గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటనపై ‘శెనార్తి మీడియా’ మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని పలువురు భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. సరైన అనుమతులు లేకుండా, సపోర్ట్ లేకుండా చేస్తుండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. దీనికి అనుమతులు ఎలా ఇచ్చారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *