మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
Mncl Collector : జిల్లాలో చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నుండి గూగుల్ మీట్ ద్వారా జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, జిల్లాలోని 16 మండలాల తహసిల్దార్లు, 7 మున్సిపాలిటీల కమీషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులతో పారిశుద్ధ్యం, డెంగ్యూ నివారణ, త్రాగునీటి సరఫరా ఇతర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కొరకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు నిత్యం తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించాలని సూచించారు. ప్రతి శు క్రవారం నిర్వహించే డ్రై డే కార్యక్రమంలో మురుగు కాలువలు, అంతర్గత రహదారులు, నివాస ప్రాంతాలలో నిలిచిన వరద నీటి తొలగింపు, తాగునీటి ట్యాంకులలో నీటిని మార్చడం, వ్యాధుల నియంత్రణ కొరకు పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన శిబిరాలు నిర్వహించడం, టామ్ – టామ్ ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో విస్తృత ప్రచారం నిర్వహించడం వంటి కార్యక్రమాల అమలు కొరకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక అధికారులు ప్రతి రోజు ఉదయం తమ పరిధిలోని ప్రాంతాలలో పర్యటించి పనుల పురోగతిపై వాట్సాప్ ద్వారా పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు టూర్ డెయిరీ తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని, పారిశుధ్య నిర్వహణలో తక్షణ అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉన్నట్లయితే ఒక వారం పని కొరకు ఏర్పాటు చేసుకోవాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని, జ్వర బాధితులను గుర్తించిన ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్ పిచికారి చేయాలని తెలిపారు. తమ పరిధిలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో నివేదిక అందించాలని తెలిపారు. అనంతరం జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు హరిశ్చంద్రారెడ్డి, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో గూగుల్ మీట్ ద్వారా జ్వర సంబంధిత కేసులు, మందులు, రక్త పరీక్షలు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జ్వర సర్వే నిర్వహించి అనుమానితుల నుండి రక్త నమూనాలు సేకరించాలని, రక్త పరీక్షలో నిర్ధారణ అయిన తరువాత సంబంధిత వైద్య చికిత్సలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు అందించే వైద్య సేవల వివరాలు ఎప్పటికప్పుడు అందించాలని, విష జ్వరాల సంబంధిత కేసులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం, అలసత్వం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల :