Narvaipet: బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం నర్వాయిపేట్ కు చెందిన దళిత రైతు జాడి మల్లేష్ మామిడి తోటను ఇటీవల ఫారెస్ట్ అధికారులు నరికి వేశారు. బాధిత కుటుంబాన్ని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ సూచన మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకట కృష్ణ మంగళవారం పరామర్శించారు. వారికి న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది హామీ ఇచ్చారు. 15 ఏళ్లుగా గాసాగు చేసుకొని జీవనదారంగా బతుకుతున్న దళిత రైతు జాడి మల్లేష్ కుటుంబం వ్యవసాయ భూమిలో 5 సంవత్సరాల క్రితం నాటిన మామిడి తోటలోని 150 మొక్కలను ఏమాత్రం సమాచారం లేకుండా అన్యాయంగా తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి 5వ డిక్లరేష్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ లు సాగు చేసుకుంటున్న భూములకు వారినే యజమానులను చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచినాక ఇచ్చిన హామీ మర్చిపోయి ఫారెస్ట్ అధికారులతో దళితులు సాగు చేసుకుంటున్న భూముల మీద దాడుల చేయిస్తున్నారని విమర్శించారు. దళిత రైతుకు అన్యాయం జరిగిందని తెలిసినా ఇప్పటి దాకా ఫోన్ ద్వారా గాని, నేరుగా కానీ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పరామర్శించలేదని మండిపడ్డారు. వెంటనే బాధిత రైతు కుటుంబాన్ని కలిసి వారికీ న్యాయం జరిగేలా చూడాలి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి సీతక్క అసెంబ్లీలో సాగు భూముల జోలికి అధికారులు వెళ్లద్దు, వారి పొట్ట కొట్టద్దు అని మాట్లాడారని గుర్తు చేశారు. మంత్రికి ఈ దళిత రైతుకు జరిగిన అన్యాయం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఫారెస్ట్ అధికారులు తొలగించిన జాడి మల్లేష్ భూమిలో మామిడి మొక్కలను తిరిగి నాటాలని, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమం లో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల :