ENG vs OMN: ఆంటిగ్వా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 28వ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఒమన్‌ను ఓడించింది. జోస్ బట్లర్ జట్టు మొదట ఒమన్‌ను కేవలం 47 పరుగులకు ఆలౌట్ చేసింది. ఈ చిన్న లక్ష్యాన్ని కేవలం ఇంగ్లండ్ కేవలం 19 బంతుల్లోనే ఛేదించింది. ఈ షాకింగ్ విజయం ఇంగ్లండ్ జట్టులో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఇంగ్లండ్ సూపర్-8లో చేరుకునే ఆశలు చిగురించాయి. ఈ మ్యాచ్‌లో ఆదిల్ రషీద్ జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రషీద్ 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
సత్తా చాటుకున్న ఇంగ్లండ్
ఇంగ్లండ్ తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. కాగా, ఆ తర్వాత రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. టోర్నీని నిలబడాలంటే భారీ తేడాతో గెలుపొంది నెట్ రన్ రేట్ ను ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ కలిసి తమ పేస్ బౌలింగ్ తో ఒమన్ టాప్ ఆర్డర్‌ను దెబ్బ తీశారు. పవర్‌ప్లేలోనే ఒమన్ జట్టు 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆపై ఆదిల్ రషీద్ ఒమన్ మిడిల్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీశాడు. జట్టు మొత్తం 47 పరుగులకే కుప్పకూలింది.
ఛేజింగ్‌కు ఇంగ్లండ్ మొదటి బంతి నుంచే బాదడం మొదలు పెట్టారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ మొదటి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి శుభారంభాన్ని ఇచ్చాడు. అయితే, ఆ తర్వాత ఔటయ్యాడు. దీని తర్వాత, విల్ జాక్వెస్ బ్యాటింగ్‌కు దిగాడు. కానీ 7 బంతుల్లో 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. జాక్వెస్ అవుట్ తర్వాత, కెప్టెన్ బట్లర్ కమాండ్ తీసుకొని ధాటిగా ఇన్నింగ్స్ ఆడాడు. 300 స్ట్రైక్ రేట్‌తో కేవలం 8 బంతుల్లో 24 పరుగులు చేసి కేవలం 19 బంతుల్లో 2 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించాడు. దీంతో ఇంగ్లండ్ ఒమన్ జట్టును బౌలింగ్, బ్యాటింగ్ తో విలవిలలాడేలా చేశాడు.
ఆస్ట్రేలియాకు వార్నింగ్..
ఒమన్‌ను ఘోరంగా ఓడించిన ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాకు వార్నింగ్ ఇచ్చింది. ఈ మ్యాచ్ తర్వాత, ఇంగ్లాండ్ జట్టు స్కాట్లాండ్ కంటే రెండు పాయింట్లు వెనుకబడి ఉంది కానీ నెట్ రన్ రేట్ పరంగా ముందంజలో ఉంది. స్కాట్లాండ్ నెట్ రన్ రేట్ +2.164 అయితే, ఇంగ్లాండ్ నెట్ రన్ రేట్ +3.081. ఇప్పుడు సూపర్-8కి వెళ్లాలంటే, వారు నమీబియాను అన్ని విధాలుగా ఓడించాల్సి ఉంటుంది.