PVT Hospitals
PVT Hospitals

PVT Hospitals: మున్నాభాయ్‌లకు.. ఎంబీబీఎస్ ల మద్దతు

  • పేషంట్లను రెఫర్ చేసే ఆర్ఎంపీలు, పీఎంపీలకు 25 నుంచి 30శాతం కమీషన్లు
  • అచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న పట్టా లేని వైద్యులు
  • అనుమతి లేని క్లీనిక్ లపై దాడులు చేస్తే స్పందించని ప్రైవేట్ డాక్టర్లు

PVT Hospitals: నాడీ పట్టే వైద్యుడు దైవంతో సమానం. అహో రాత్రులు శ్రమించి వైద్యవిద్యను అభ్యసించి డాక్టర్ పట్టా తీసుకుంటున్న డాక్టర్లు ప్రజల ప్రాణాలు నిలబెడుతున్నారు. కానీ ఆ వైద్య వృత్తికే కొందరు కళంకం తెస్తున్నారు. అయితే వారిలో కొందరు వైద్యం పేరిట పేదల నుంచి డబ్బులు గుంజడం ఒకెత్తయితే.. వారిని ఆరోగ్య పరంగా మరింత భయాందోళనకు గురి చేయడానికి ఆర్ఎంపీలు, పీఎంపీలను పావులుగా వాడుకుంటున్నారు. తమ హాస్పిటల్ కు పేషంట్లను పంపిస్తే ఒక్కో రోగి బిల్లు నుంచి (మందుల ఖర్చు మినహాయించి) 25 నుంచి 30 శాతం వరకు కమీషన్లు ముట్టజెప్పుతున్నారు. దీంతో అటు పెద్ద పెద్ద హాస్పిటళ్లు పెషంట్లతో కళకళలాడుతుండగా, అటు ఆర్ఎంపీలు, పీఎంపీల జేబులు కాసులతో గలగలలాడతున్నాయి.

వ్యాపారంగా వైద్యం..
వైద్యం కూడా కొందరికి వ్యాపారంగా మారింది. అత్యవసర సేవా విభాగమైన వైద్యం ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టే బాతుగా భావిస్తున్నారు కొందరు. అయితే హాస్పిటల్‌ పెట్టడానికి ప్రస్తుతం వైద్య పట్టాలు అవసరం లేకుండా పోతున్నది. ఓ నలుగురిని తమ భాగస్వాములను చేసుకొని పెట్టుబడి పెట్టిస్తున్నారు. ఓ వైద్య పట్టా ఉన్న వ్యక్తి పేరిట మల్టీస్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ అంటూ పెద్ద పెద్ద హాస్పిటళ్లకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. లేకుంటే డాక్టర్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఏడాదికి, నెలకు ఇంత ఇస్తామంటూ దారికి తెచ్చుకుంటున్నారు. ఇక వైద్య ఆరోగ్యశాఖ, ఇతరశాఖల అధికారులను ప్రభావితం చేస్తూ ఏంచక్కా అనుమతులు తెచ్చుకుంటున్నారు.

కథ ఇక్కడి నుంచే మొదలు..
సూపర్ స్పెషాలిటీనో, లేదా మల్టీ స్పెషాలిటీనో ఏర్పాటు చేస్తే ఏం లాభం.. పెషంట్లు రావాలి కదా. దీనికీ అనేక మార్గాలు వెతుక్కున్నారు. ముందుగా నేరుగా గ్రామాల్లోని ఆర్‌ఎంపీలు, పీఎంపీలను కొందరిని తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. పట్టణాల్లో అంబులెన్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లలో కొందరిని మచ్చిక చేసుకుంటున్నారు. వారికి కమీషన్లు ముట్ట జెప్తూ ఉండడంతో ఆ పెద్ద దవాఖానల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న చందంగా మారుతోంది. ఏడాది తిరిగే లోపే మరో చోట మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభిస్తున్నారంటే వైద్యం ఎలా వ్యాపారమైందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

నిన్నటి కంపౌండర్లే.. నేటి వైద్యులు
కంపౌండర్ గా ఏదైనా పెద్ద హాస్పిటల్ లో పనిచేస్తే నెలకు పది వేల నుంచి పదిహేను వేల వరకు జీతం వస్తుంది. పైగా అత్యవసర విభాగం కావడంతో పండుగలు, సెలవు దినాల్లోనూ డ్యూటీలు చేయాల్సిందే. దీంతో తాము దగ్గరుండి చూసిన వైద్యాన్ని ఇంతే కదా ఆర్ఎంపీలు, పీఎంపీలమంటూ క్లీనిక్ లు తెరుస్తున్నారు. ఇక ఇక్కడి నుంచి వీరి జీవితాలే మారిపోతున్నాయి. నేరుగా క్లీనిక్ లు పెట్టేస్తున్న అర్హత లేని వైద్యలు వారికి అనుబంధంగానే మెడికల్ షాపులు పెట్టిస్తున్నారు. అటు తక్కువ ఫీజుతో ఓపీ చూస్తున్నామని చెబుతూనే ఇటు మందుల విక్రయాల్లోనూ దండుకుంటున్నారు. చిన్న చిన్న జ్వరాలు, నొప్పులతో క్లీనిక్ లకు వస్తున్న వారికి వచ్చీ రాని వైద్యం చేస్తున్నారు. అవసరం లేకున్నా సైలైన్లు ఎక్కిస్తున్నారు. కొంత కాలంగా రక్త, మూత్ర పరీక్షల ల్యాబ్ లు కూడా తెరిచేశారు. చిన్న చిన్న జ్వరాలకు పెద్దాసుపత్రికి వెళితే వేలాది రూపాయలు పరీక్షలు, మందులు పేరిట గుంజుతుండంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. స్థానికంగా ఉండే క్లీనిక్ లకు వెళ్తున్నారు.

శంకర్ దాదాలకే జిందాబాద్..
మంచిర్యాల జిల్లాలో చిన్న, పెద్ద ఆసుపత్రులు మొత్తం దాదాపు 253 వరకు ఉన్నాయి. ఇందులో అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ, డెంటల్, ల్యాబ్లు, డయాగ్నస్టిస్ సెంటర్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లాలో ఆర్ఎంపీలు, పీఎంపీలు మొత్తంగా జిల్లాలో 863 మంది ఉన్నారు. కొన్ని పెద్దాసుపత్రుల వ్యాపారమంతా ఆర్ ఎంపీల మీదే సాగుతున్నదంటే అతిశయోక్తి కాదు. కొన్ని పెద్దాసుపత్రుల నిర్వాహకులు తమకు పెషంట్లను రెఫర్ చేసే ఆర్ఎంపీలకు రోగి బిల్లులో మందులు మినహాయించి 25 శాతం నుంచి 30 శాతం వరకు కమీషన్ ముట్టజెప్తున్నట్లు తెలుస్తున్నది.

స్పందించని వైద్యులు
ఇటీవల మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ఆర్ఎంపీల క్లీనిక్ లపై వైద్యాశాఖ దాడుల చేసిన విషయం తెలిసిందే. అర్హత లేని వారు వైద్యం చేస్తున్నారని ప్రైవేట్ వైద్యశాలల నుంచి ఒక్క డాక్టర్ కూడా స్పందించకపోవడం గమనార్హం. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ వైద్యులు ఈ మున్నాభాయ్ లను ఎంతగా నమ్ముకుంటున్నారో. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సర్కారు వైద్యశాలల్లో మెరుగైన సేవలందించడంతో పాటు బస్తీ దవాఖానల సంఖ్య పెంచితే పేదలు, సామాన్య ప్రజలు ప్రాణాలు కాపాడుకోగలుగుతారు. లేదంటే ఈ ఆర్ఎంపీలు, పీఎంపీల చేతిలో ప్రాణాలు కోల్పోవడం లేదా కొన్ని పెద్దాసుపత్రులకు వెళ్లి ప్రాణాలతో పాటు డబ్బులు కూడా పోగొట్టుకోక తప్పదు.

శెనార్తి మీడియా, మంచిర్యాల

 

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *