వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు
రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
రాజన్నను దర్శించుకున్న మంత్రి
స్వాగతం పలికిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ
Vemulavada Temple :తిరుమల తరహాలో వేములవాడ (Vemulavada) శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి మంత్రి బుధవారం రాగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈఓ వినోద్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ప్రభుత్వ విప్ నకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు అద్దాల మండపంలో మంత్రి, విప్, కలెక్టర్, ఎస్పీకి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, రానున్న కార్తీకమాసంలోగా భక్తులకు నిత్యాన్న సత్రం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సత్రం ఏర్పాటుకు దాతలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని మంత్రి కోరారు. రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ ఆలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు స్వామివారి దర్శనం వేగంగా కల్పించేందుకు, మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆలయ అభివృద్ధికి శృంగేరి పీఠం, పండితులు, భక్తుల సూచనల మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. రాజన్న కోడెల సమస్యలను పరిష్కరించామని గుర్తు చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం, మంత్రులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ఏడాది శ్రావణ మాసం ఆరంభం నుంచి భక్తుల కోసం బ్రేక్ దర్శనాన్ని అమల్లోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా 1400 మంది భక్తులు దర్శించుకోగా, దాదాపు రూ. 15 లక్షల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఇప్పటికే 1500 కోడెల కలెక్టర్ అధికారులతో కలిసి రైతులకు అందజేశామని తెలిపారు. అలాగే కోడెల కోసం మూడు షెడ్లు నిర్మించామని, మరొకటి నూతనంగా నిర్మిస్తున్నామని వివరించారు. కోడెలకు దాణా, పచ్చి గడ్డి అందజేస్తున్నామని తెలిపారు. భక్తులకు వసతి కల్పించేందుకు గదులు నిర్మించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు.
అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వేములవాడ లో 300 ఏంటిఎస్ గోదాం, ప్యాక్స్ ఆన్లైన్ సర్వీస్ డిజిటల్ సేవా కామన్ సర్వీస్ సెంటర్ ను, ది కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ లి. వేములవాడ శాఖ నూతన భవనాన్ని, బ్యాంక్ ఏటిఎం ను మంత్రి, విప్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు తో కలిసి ప్రారంభించారు. సహకార బ్యాంక్ నుంచి విద్యా లోన్ ,గృహ లోన్, స్వయం ఉపాధి లోన్ చెక్కులు మంత్రి, విప్ పంపిణీ చేశారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటి దశ లో లక్ష ,రెండో దశ లక్ష 50 వేలు ,మూడో దశలో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశామని, 2018 డిసెంబర్ 12 ముందు లోన్ తీసుకొని బకాయిలు ఉన్నవారు, 2023 డిసెంబర్ 9 తరువాత తీసుకున్న వారికి లోన్ మాఫీ కాలేదని స్పష్టం చేశారు. 265 రోజుల్లో 85 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, 2500 కోట్ల రూపాయలు విలువైన ఉచిత టికెట్లపై ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. వేములవాడ, కొండగట్టు, ఇతర ఆలయాలకు వెళ్లేందుకు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని వివరించారు.
యావత్ తెలంగాణ లో 70 శాతానికి పైగా మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వాడుకుంటున్నారని, రూ. 500 కి గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే నెల 17వ తేదీ నుంచి ప్రజా పాలనలో భాగంగా ఆరు గ్యారంటీల అమలు దరఖాస్తులు స్వీకరిస్తామని, నూతన రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ కోసం 31 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టారని, ఇప్పటికే 18 వేల కోట్లు రుణ మాఫీ పూర్తయిందని తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అర్బన్ తాసిల్దార్ మహేష్ కుమార్, వేములవాడ పిఎసిఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, ఆయా సంఘాల చైర్మన్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, రాజన్న సిరిసిల్ల