ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
TG Chief Secretary Review : సీజనల్ వ్యాధులు, విషజ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Shanthi Kumari) అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సీజనల్ వ్యాధుల నియంత్రణ, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో పరిస్థితులు, స్వచ్ఛదనం-పచ్చదనం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, విషజ్వరాల నియంత్రణపై అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలని, పాటించవలసిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ఫ్రై డే-డ్రై డే (Friday-Dry day)కార్యక్రమాన్ని కొనసాగించాలని, వసతి గృహాలు, పాఠశాలలు, భవన నిర్మాణ ప్రదేశాలలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమల వృద్ధిని అరికట్టేందుకు ఆయిల్బాల్స్, ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయాలని, జిల్లా, డివిజన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలలో రాపిడ్ రెస్సాన్స్ బృందాలను ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యాధుల నియంత్రణకు అవసరమైన మందులను ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉంచుకోవాలని, వ్యాధుల నిరార్ధరణ పరీక్షలకు అవసరమైన కిట్ల కొరకు ప్రతిపాదనలు అందించాలని తెలిపారు. వసతిగృహాలు, పాఠశాలల్లో పరిశుభ్రత ఆవశ్యకతను విద్యార్థులకు వివరించి చేతుల శుభ్రపర్చుకోవడాన్ని అలవాటుగా మార్చుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి ఆయా ఆసుపత్రులలో అందించే వైద్య సేవల సంబంధిత ధరల పట్టికను ఆసుపత్రి ఆవరణలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు నివాస ప్రాంతాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, విషజ్వరాలను గుర్తించిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు అన్ని వైద్య సేవలు అందించాలని, అవసరమైన మేర అదనపు వార్డులు, పడకలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, ప్రతి నెల మొదటి వారంలో కార్యక్రమం నిర్వహించేలా కార్యచరణ రూపొందించుకోవాలని, 1 కోటి 2 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా ఇప్పటి వరకు 79 లక్షల మొక్కలు నాటడం జరిగిందని, నాటి మొక్కలకు జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని, మిగతా లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.
పల్లెప్రకృతి వనాలు, బృహత్ పల్లెప్రకృతి వనాలలో ఖాళీ ఉన్నట్లయితో మొక్కలు నాటి సంరక్షించాలని, ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించాలని తెలిపారు. వసతిగృహాలు, పాఠశాలలను సంబంధిత అధికారులు సందర్శిస్తూ ఆహార నాణ్యత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో వీధికుక్కలు, కోతుల బెడద నివారించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా కేంద్రంలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఇతర విషస్ జ్వరాలపై వైద్య సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ గ్రామాలు, మున్సిపాలిటీలలో శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇంటింటికి వైద్య సిబ్బందితో సర్వే నిర్వహించి అనుమానితుల రక్త నమూనాలను సేకరించి తగు వైద్య చికిత్సలు అందించడంతో పాటు వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
మున్సిపాలిటీలు, గ్రామాలలో పారిశుధ్య (Sanitation)నిర్వహణ పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, నీరు నిలువ లేకుండా అంతర్గత రహదారులలో గుంతలను పూడ్చడం, దోమల వృద్ధిని అరికట్టేందుకు ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయడం జరుగుతుందని, ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని వారానికి 2 సార్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పారిశుధ్యంపై చర్యలు చేపట్టడంతో సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసేందుకు అవసరమైన కార్యచరణ రూపొందించి అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :