SC issued Bail to Kavitha: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సలీ కల్వకుంట కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. మంగళవారం సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. మార్చి 15న కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
కవిత బెయిల్ పిటిషన్‌ను గతంలో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. రూ. 10 లక్షల పూచీకత్తుపై కల్వకుంట్ల కవితను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పాటు సాక్షులను ప్రభావితం చేమొవద్దని, సాక్ష్యాలను తారుమారు చేయవద్దని కోర్టు ఆదేశించింది.
సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపణలు
ఎక్సైజ్ పాలసీ వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ కేసులో తన పాత్రను దాచిపెట్టేందుకు బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత పలు సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఈడీ తన చార్జ్ షీట్‌లో ఆరోపించింది. కవిత నుంచి 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, అయితే అవన్నీ ఫార్మాట్ చేసిన ఫోన్లేనని ఈడీ తన చార్జీషీట్‌లో పేర్కొంది. వాటిలో ఏ డేటా లేదని సపష్టం చేసింది. ఈడీ కూడా కవిత ఫైవ్ స్టార్ హోటల్ లో రూ.10 లక్షల విలువైన గదిని బుక్ చేశారని ఆరోపించింది. దీంతో పాటు సాక్షులను ప్రభావితం చేయడంలో పాలుపంచుకున్నారని పలు ఆరోపణలు చేసింది.