జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతీలాల్
Prajavaani: ప్రజావాణి కార్యక్రమంలో సమస్యల పరిష్కారంపై అర్జీదారులు చేసుకున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన పొన్నం బాలకృష్ణ తనకు జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులో భూమి ఉందని, ఇట్టి భూమి నుండి కొంత భాగం జాతీయ రహదారి నిర్మాణం కొరకు పోతుందని తనకు నోటీసు ఇచ్చారని, తన భూమి నివాస ప్రాంతాలలో ఉన్నందున తనకు నష్టపరిహారం ఎక్కువగా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నస్పూర్ మండలం శ్రీరాంపూర్ కాలనీకి చెందిన దూపం గురువయ్య తనకు గల ఇంటిని తన అన్న కొడుకుకు కిరాయికి ఇవ్వగా తనకు తెలియకుండా మునిసిపల్ రికార్డులలో అతని పేరిట మార్చుకున్నారని, ఈ విషయమై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కోటపల్లి మండలం దేవులవాడ గ్రామానికి చెందిన అసరెల్లి సమ్మయ్య తాను మావోయిస్టుగా ఉండి లొంగిపోయినందుకు పునరావాసం కోసం ప్రభుత్వం భూమిని ఇచ్చిందని, ఇట్టి భూమిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల ఏర్పాటు చేసినందున వేరొక చోట ఇంటి నివాస స్థలము కేటాయించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. భీమిని మండల కేంద్రానికి చెందిన మురికి బీరయ్య తన తాతల నుండి వడాల శివారులో భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, ఇట్టి భూమికి తమకు పట్ట పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జన్నారం మండలం పోనకల్ గ్రామానికి చెందిన జాడి దుర్గయ్య తనకు చింతగూడెం గ్రామ శివారులో ఉన్న భూమికి నూతన పట్టా పాస్ పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి పట్టణం 3వ జోన్ కు చెందిన రొడ్డ మల్లయ్య తాను గతంలో కొనుగోలు చేసి తన పేరిట పట్టా కాబడిన భూమి ధరణి పోర్టల్లో మరొకరికి వారసత్వంగా వచ్చినట్లు చూపుతోందని, ఈ విషయమై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. నస్పూర్ మండల కేంద్రానికి చెందిన తన కొండ రాజేశ్వరి తన భర్త గుడిపేటలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ బెటాలియన్ లో 15 సంవత్సరాల నుండి ఒప్పంద పద్ధతిన ఉద్యోగం చేస్తూ మరణించారని, తన కుమారుడికి కారుణ్య నియామకం కింద అర్హత మేరకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన కొదురుపాక లచ్చన్న తనకు గ్రామ శివారులో భూమి ఉందని, పాత పట్టా పాసుపుస్తకం కలిగి ఉన్నానని, ధరణి రికార్డులలో వివరాలు నమోదు చేసి నూతన పట్టా పాసు పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జన్నారం మండలం పొనకల్ గ్రామానికి చెందిన కలకుంట్ల చంద్రశేఖర్ తాను నాలా కన్వర్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నానని, వివరాలు పరిశీలించి మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతీలాల్ మాట్లడారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల