NASPUR1
NASPUR1

Politics:అధికార పార్టీలో చేరితే ఏదైనా సాధ్యమేనా…?

వరుస కట్టింది అక్రమాలను సక్రమం చేసుకునేందుకేనా?
నస్పూర్, లక్షెట్టిపేటలో వెంచర్లు కాపాడుకుంటున్నారా
డీటీసీపీ పూర్తి అప్రూవల్ రాకుండా నిర్మాణాలు
నిబంధనలు తుంగలో తొక్కుతున్న మున్సిపల్ సిబ్బంది
వెంచర్ నిర్వాహకులు అధికార పార్టీలో చేరింది అందుకేనా

Politics: మంచిర్యాల నియోజకవర్గంలో కొందరు అక్రమార్కులు అధికారంలోకి ఏ పార్టీ ఉంటే అందులోకి దూరిపోతున్నారు. అయితే ఈ చేరికలన్నీ పార్టీ మీద అభిమానంతోనో, లేక ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసో కాదు.. కేవలం అధికార పార్టీలో ఉండి తామ చేసే అక్రమాలను కప్పిపుచ్చుకోవడమే లక్ష్యంగా కనిపిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మూడు మున్సిపాలిటీలో ఉన్న వారిలో ఎక్కువ శాతం కండువాలు మార్చిన వారే. అధికార పార్టీలో ఉంటే ఏం చేసినా నడుస్తుందనే ఉద్దేశంతో తప్ప మరోటి కాదని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంట్లో అనుమతి లేకుండా అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన కొందరు కౌన్సిలర్లు, చోటామోటా నాయకులే అధికం. వారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయకుని చెంత చేరి భజనలు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు.

వ్యాపారం కాపాడుకునేందుకేనా..?
జిల్లాలోని నస్పూర్, లక్షెట్టిపేట మున్సిపాలిటీలో వెంచర్లు వేసి వాటిని కాపాడుకునేందుకే ఓ బీజేపీ లీడర్ బీఆర్ఎస్ లో చేరి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి దందాలు కొనసాగిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు అనుమతులు ఇవ్వకుంటే అధికార పార్టీ నేత పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. ఎలాంటి నియమ నిబంధనలు లేకుండానే వారు అడిగిన పని చేయించుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. వాటిని కొనుగోలు చేసిన ప్రజలు ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ అధికారులు చర్యలు తీసుకోవడంతో అధికార పార్టీలో చేరి బతికిపోయామంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. దీనికి ఓ కౌన్సిలర్ చేసిన నిర్వాకమే ఇందుకు ఉదాహరణ. నస్పూర్ మున్సిపాలిటీలోని సీతారాంపల్లిలో వెంచర్ కు అనుమతులు రాకముందే యథేచ్ఛగా భవనం నిర్మించాడు. అధికార పార్టీలో తమ పనులు ఎలా చక్కబెట్టుకోచ్చో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

నిబంధనలు ఉల్లంఘించిన చర్యలు శూన్యం
వెంచర్ కు అనుమతులు ఆగస్టులో రాగా, నిర్మాణం పనులు మాత్రం ముందస్తుగానే చేపట్టారు. దీనికి కారణం… అధికార పార్టీలో ఉన్నామనే ధీమా. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరులే అనే ధైర్యం.

Venture
Venture

అధికార పార్టీ అయితే చాలు
నస్పూర్, లక్షెట్టిపేటలో అధికార పార్టీలోని కొందరు నాయకులు హల్చల్ చేస్తున్నారు. తహసీల్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లేవుట్ లేని ప్లాట్లకు అనుమతులు ఇప్పిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటి పర్మిషన్లు తెప్పించుకుంటున్నారు. సామాన్యులు మాత్రం నెలల తరబడి, ఏండ్ల తరబడి ఆయా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తారా అనేది చూడాల్సిందే.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *