NDA Alliance: 2024 ఎన్నికల పోరులో బీజేపీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈసారి పార్టీ నాయకత్వం ఎన్డీయేకు 400 దాటాలనే నినాదాన్ని లేవనెత్తింది. అయితే బీజేపీ 240 సీట్లకే పరిమితమైంది. 543 లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ మార్కుకు బీజేపీ దూరంగా ఉండిపోయింది. అయితే, ఎన్డీయే కూటమి మెజారిటీ సాధించడంలో విజయం సాధించింది. ఇందులో ముఖ్య భూమిక పోషించిన పార్టీల్లో టీడీపీ ఒకటి. ఇప్పుడు ఆ పార్టీ కీలకంగా మారింది. బీజేపీ తర్వాత అధికార ఎన్డీయేలో టీడీపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో చంద్రబాబు ‘కింగ్‌మేకర్’గా ఎదిగారు. ఈ ఎన్నికల్లో 16 స్థానాల్లో విజయం సాధించింది. మూడోది 12 సీట్లు సాధించిన జేడీయూ. సీట్ల సమీకరణను పరిశీలిస్తే ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ టీడీపీతో పాటు నితీష్ కుమార్ జేడీయూపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుని నమ్మవచ్చా? గత అనుభవాలను పరిశీలిస్తే బీజేపీకి భంగపాటు తప్పలేదు. అయితే ఈసారి బీజేపీ ఆయనను పూర్తిగా నమ్ముతుందా? లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
బాబుకు ఇండియా కూటమి నుంచి ఆఫర్లు
చంద్రబాబు నాయుడుపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆయనకు ఇండియా అలయన్స్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని రూమర్లు వస్తున్నాయి. అయితే తాము ఎన్డీయేలోనే ఉన్నామని, మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్తున్నామని టీడీపీ అధినేత ప్రకటించారు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ ప్రకటనతో బీజేపీ ఊపిరి పీల్చుకుంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై 2018 మార్చిలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)తో నాయుడు తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. బాబు నిర్ణయం 2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో స్పష్టమైంది. రెండు ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని టీడీపీ చవి చూసింది. దీంతో బాబు రాజకీయ భవిష్యత్ పై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకున్నాయి.
2018లో వైదొలిగి 2024లో ఎన్డీయే గూటికి
చంద్రబాబు నాయుడు సరిగ్గా ఆరేళ్ల తర్వాత అంటే 2024 మార్చిలో ఎన్డీయేలో చేరారు. బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. కూటమి కింద రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేశాయి. రాష్ట్రంలో బిజెపితో పొత్తు ఉన్నప్పటికీ, నాయుడు ముస్లిం రిజర్వేషన్ విషయంలో భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. ముస్లిం రిజర్వేషన్ల రాగం అందుకున్నారు. మొదటి నుంచి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, ఇది కొనసాగుతుందని తన ప్రచారంలో స్పష్టం చేవఆరు. అయితే, టీడీపీ తన మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టలేదు.
ప్రధాని మోదీపై పొగడ్తలు
ఎన్డీయేలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలోనూ ప్రధాని నరేంద్రమోడీని పొగడటం కనిపించినా, గతంలో ఆయనతో సంబంధాలు సజావుగా లేవు. 2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత నాయుడు మోడీని వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా నాయుడు పేరు మీద ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఆయన అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 13 ఏళ్ల 247 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతే కాకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత విభజిత ఆంధ్రాకు తొలి ముఖ్యమంత్రి చంబ్రాబే.
బాబు ఎత్తుగడలపై అందరి దృష్టి
చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపారు. 1996 , 1998 లోక్‌సభ ఎన్నికల సమయంలో యునైటెడ్ ఫ్రంట్‌కు నాయకత్వం వహించాడు. 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ముందు, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్డీయేలో చేరినప్పుడు దానికి కన్వీనర్‌గా కూడా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రయాణం 1970లలో మొదలైంది. తొలుత యూత్ కాంగ్రెస్‌లో పని చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. ఇప్పుడు కొత్త రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కింగ్ మేకర్ గా ఎదిగారు. మరి అతని తదుపరి ఎత్తుగడ ఏమిటన్నది చూడాలి.