VAJRAM VETA

Searching For Diamonds: వానొస్తే వజ్రాల వేట.. ఎక్కడో తెలుసా?

Searching For Diamonds:  కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయన్న విషయాన్ని జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) ఇటీవల గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్‌ఎంపీ తండా గ్రామాల్లో వజ్రాలు లభ్యమవుతున్నాయనే చర్చ ఎప్పటి నుంచో ఉంది.

ఈ నేపథ్యంలో తొలకరి జల్లులు కురియగానే తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల వేట కొన్నేళ్లుగా సాగుతున్నది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు పడ్డాయి. దీంతో వజ్రాల కోసం అన్వేషణ మొదలైంది. ఈ ప్రాంతంలోని పొలాలు వజ్రాల కోసం అన్వేషిస్తున్న వారితో నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. ఒక్కొక్కరు వారం నుంచి పదిహేను రోజులపాటు ఇక్కడే ఉంటున్నారు. ఓ వైపు వజ్రాల కోసం కొందరు పొలాల్లో తిరుగుతుంటే.. పంట భూములు దెబ్బతింటుున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాల్లోకి ఎవరూ రావొద్దని కొందరు రైతులు విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు.

ఇక్కడే నాణ్యమైన వజ్రాలు

వజ్రాల మైనింగ్‌ కోసం 1969లో వజ్రకరూర్‌లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని ప్రారంభించారు. వజ్రాల అన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు.అనంతరం ఓ ఆస్ట్రేలియన్‌ కంపెనీ ఇక్కడ కొద్దికాలం సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి కూడా. అందుకే వీటి వెలికితీతపై దృష్టి సారిస్తే ఉపయోగంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు.

వజ్రాలు ఎలా దొరుకుతాయంటే

మన దేశంలో వజ్రాల మైనింగ్‌ మధ్యప్రదేశ్‌ రాష్ర్టంలోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వి తీసి వజ్రాల తయారీ ప్రక్రియ మొదలు పెడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతులో వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తుంటాయి. ఆ తర్వాత వెదరింగ్‌ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి ముక్కలవుతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా లభిస్తుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకొని పోయి ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైనవి ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి.

ఏజెంట్ల తిష్ట

వర్షాకాలం వస్తే జనాలు ఎలా తరలివస్తారో.. వజ్రాల వ్యాపారులు కూడా గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను కూడా నియమించుకుంటున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు అక్కడ వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి బేరం కుదురుస్తారు. వజ్రం విలువైనదైతే వ్యాపారులే వారి దగ్గరికి వెళ్తారు. పోటీ పెరిగితే వ్యాపారులు వేలం పాడుకుంటారు. వజ్రం నాణ్యత (క్యారెట్‌)ను బట్టి రూ.20 వేల నుంచి రూ.20 లక్షల దాకా వెచ్చించి కొనుగోలు చేస్తారు. జిల్లా చరిత్రలో 2022లో లభించిన 30 క్యారెట్ల వజ్రమే అత్యంత విలువైంది రికార్డుకెక్కింది. ఈ ఏడాది ఇప్పటికే 9 వజ్రాలు దొరికాయి. గతేడాది సరైన వానలు లేవు. అయినా 18 వజ్రాలు లభించాయి. వజ్రాలను ఇక్కడి స్థానిక వ్యాపారులకే అమ్ముతుంటారు. ఇక్కడి వ్యాపారులు అంత విశ్వాసాన్ని పొందారు. ముందుగా చెప్పిన రేటు చెల్లిస్తుంటారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే వాటిని తీసుకొని రూపాయి కూడా ఇవ్వరనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా అమ్ముతుంటారు.

విదేశాల్లో కొనుగోలు కేంద్రాలు

ఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తుంటాయి. వాటిని అల్యూవియల్‌ డైమండ్స్‌ అంటుంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు దొరికిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత బట్టి కొంత మొత్తం చెల్లిస్తారు. లీగల్‌ ప్రక్రియను ప్రభుత్వమే పూర్తి చేస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50 నుంచి 60 వరకు వజ్రాలు దొరుకుతున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30 నుంచి 40 వజ్రాలు దొరుకుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద దాకా వజ్రాలు దొరుకుతన్నాయి. మైనింగ్‌ చేస్తే రూ.వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశాలు సైతం ఉన్నాయి.

ఈసంవత్సరం లభ్యమైన వజ్రాల వివరాలు

గత నెల 8న చెన్నంపల్లిలో రూ.3.96 లక్షల విలువైన వజ్రం లభించింది.
మే 20న రామాపురంలో రూ.50 వేల విలువ గల వజ్రం దొరికింది.
మే 21న మద్దికెర మండలం మదనంతపురంలో రూ.6.50 లక్షల విలువైన వజ్రం దొరికంది.
మే 22న ఇదే గ్రామంలో దొరికిన వజ్రాన్ని రూ.18 లక్షలు, 10 తులాల బంగారం చెల్లించి ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు.
మే 23న జొన్నగిరిలో రూ.15 వేలు, పగిడిరాయిలో రూ.12 వేల విలువ చేసే వజ్రాలు దొరికాయి.
మే 24న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.6.20 లక్షల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి ఓ వ్యాపారి కొనుగోలు చేశారు.
గతనెల 25న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.1.20 లక్షల నగదు, జత కమ్మలు ఇచ్చి మరో వ్యాపారి కొనుగోలు చేశారు.
గత నెల తుగ్గలి మండలం గుండాలతండాకు చెందిన వ్యక్తికి ఓ వజ్రం లభ్యమైంది. స్థానిక వ్యాపారి రూ.లక్ష నగదు, అర తులం బంగారం ఇచ్చి వజ్రం కొనుగోలు చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *