Review meeting on Kavval Tiger Zone
Review meeting on Kavval Tiger Zone

Kavval Tiger Zone: ‘కవ్వాల్’ లో నిబంధనలు అమలు చేయాలి

  • మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్

Kavval Tiger Zone: జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యం (Kavval Tiger Zone)  పరిధిలో వన్యప్రాణి సంరక్షణ, అటవీ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో కల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ లతో కలిసి దండేపల్లి, జన్నారం మండలాల తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయితీ కార్యదర్శులతో అభయారణ్యం పరిధిలో నిబంధనల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ, అటవీ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ప్రాంతంలో నిషేధిత, అక్రమ వ్యాపారాలు, ఆక్రమిత నిర్మాణాలు జరగకుండా పర్యవేక్షించాలని, పెద్ద మొత్తంలో కోళ్లు, గొర్రెల పెంపకం, నిర్మాణాలకు తప్పనిసరిగా అనుమతి పొందాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 అభయారణ్యాల చుట్టూ బఫర్ జోన్ పరిధి విధించడం జరుగుతుందని, 2012లో టైగర్ రిజర్వు నోటిఫై చేయడం జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీసం 1 కిలోమీటర్ పరిధి వరకు ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేయాలని, పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం 10 కిలోమీటర్ల రేడియస్ జోన్ ఏర్పాటు చేయవలసి ఉంటుందన్నారు. ఒకవేళ ఏర్పాటు చేయనట్లయితే డిఫాల్ట్ గా 10 కిలోమీటర్ల మేర జోన్ పరిధి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

జన్నారం మండలంలోని చింతగూడ, ఇంధనపల్లి, బటుగూడ చింతపల్లి, పోనకల్, దేవునిగూడ, జన్నారం, కొత్తపేట, కవ్వాల్, వెంకటాపురం, మురిమడుగు, కలమడుగు, సింగరాయపెట్, తపాల్ పూర్, రోటి గూడ, మహమ్మదాబాద్, మల్యాల్ గ్రామాలు వస్తాయని, దండేపల్లి మండలంలోని తానిమడుగు, దండేపల్లి, పాత మామిడిపల్లి, మామిడిపల్లి, లింగాపూర్, మాకులపేట, రాజగూడ గ్రామాలు వస్తాయని తెలిపారు. ఈ గ్రామాలలో నిషేధిత వ్యాపార కార్యక్రమాలు, మైనింగ్, కాలుష్యకారక, రసాయన పరిశ్రమలు, కమర్షియల్ ఫిషింగ్, సాలిడ్ వేస్ట్, బయో మెడికల్ వేస్ట్, ఇసుక త్రవ్వకాలు లాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎకో సెన్సిటివ్ జోన్ సంబంధిత మ్యాప్ రూపొందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో జరిగే కార్యక్రమాలు కమిటీ పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు
సమావేశంలో పాల్గొన్న అధికారులు

-శెనార్తి మీడియా, మంచిర్యాల 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *