- కంపెనీ ఒక్కటే.. కానీ ఊరికో పేరు..
- గుంటల్లో కొనుగోలు.. గజాల్లో విక్రయాలు
- వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేస్తున్న ‘స్టార్’ కంపెనీ
- పట్టపగలే ‘నక్షత్రా’లు చూపిస్తున్న వ్యాపారులు
శెనార్తి మీడియా, మంచిర్యాల:
Real Estate : మంచిర్యాల జిల్లాలో వ్యవసాయ భూముల్లో ప్లాట్ల దందా జోరుగా నడుస్తుంది. నేషనల్ హైవే చుట్టూ రెండు కిలోమీటర్లు అనుకొని ఉన్న వ్యవసాయ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేస్తున్నారు. వ్యవసాయ భూములను గమనించిన వ్యాపారులు వాటిపై రాబంధుల్లా వాలి పోతున్నారు. రైతులను మచ్చిక చేసుకొని వారి అవసరాలను ఆసరాగా చేసుకుంటున్నారు. పంట భూములకు అరకొర రేట్ ఫిక్స్ చేసి వారికి టోపీ పెట్టి ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్న పంచాయతీ, రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టా రీతిలో ప్లాట్లు విక్రయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని చుట్టుపక్కల గ్రామాలను ఆసరాగా చేసుకోని రైతుల్లో వద్ద గుంటల్లో కొనుగోలు చేసి గజాల్లో విక్రయిస్తున్న వైనం వెలుగులోకి వస్తున్నది. ఇందుకు జిల్లాలోని ఓ ‘నక్షత్రం’ పట్ట పగలే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. డీటీసీపీ అనుమతి కేవలం ఒక్క చోట మాత్రమే తీసుకొని, అనధికారికంగా మూడు చోట్ల వెంచర్లు వేసింది. ఇందులో లక్షెట్టిపేటలో ఒకటి, హాజీపూర్ మండలంలో రెండు చోట్ల వెంచర్లు చేసి ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుంటల చొప్పున కొనుగోలు చేస్తున్న నక్షత్రం గజాల లెక్కన ప్లాట్లు చేసిన విక్రయిస్తున్నది. కంపెనీ ఒక్కటే అయినా ఊరికో పేరు చొప్పున వెంచర్ ఏర్పాటు చేస్తున్నది. ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి భూములు కొనుగోలు చేస్తున్నారన్న వాదనలూ ఉన్నాయి. ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారితో కొనుగోలుదారులను రప్పించుకుంటున్నది. ఆదివారం రాగానే వారిని తీసుకొని ఆయా వెంచర్ల చుట్టూ చక్కర్లు కొట్టించి మోసపురిత మాటలతో పాటు వారితో భూములకు అడ్వాన్స్ రూపంలో వసూలు చేస్తున్నది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నది.
ఫ్రీ లాంచింగ్ ఆఫర్… ప్రతి వెంచర్లో ఇదే తంతు..
మంచిర్యాల రెవెన్యూ డివిజన్లో నాన్ లేఅవుట్ ప్లాట్లకు బాగా డిమాండ్ ఉంది. ఆఫర్ల పేరుతో కొందరు రియల్టర్లు కేవలం రూ. 51 వేలు కడితే చాలు గ్రాము బంగారం ఇస్తామంటూ ఆఫర్లు పెడుతున్నారు. కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలను ఆసరాగా చేసుకొని ప్రజలను మభ్యపెట్టి నాన్ లే అవుట్ ప్లాట్లను సైతం విక్రయిస్తుండడం గమనార్హం. ఇది ఇలా ఉంటే జిల్లాలో పంట భూములకు రేట్లు కట్టి., రైతులతో బేరసారాలు చేసుకొని రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. ఇదంతా మండల కేంద్రంలోని మండల కార్యాలయంలో జరుగుతుండడం కొసమెరుపు. మండలంలో నాలా కన్వర్షన్ చేయించడం, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్లాట్ల చొప్పున రిజిస్ట్రేషన్ జరుగుతున్నా ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో రియల్టర్లు ఆడిందే ఆట. పాడిందే పాటగా మారింది. మరి ఆ శాఖలోని ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటరా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదేశాలు బేఖాతరు
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు చేయడంలోనూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ ముందు వరుసలో ఉంటున్నది. తన పరిధిలో ఉన్న కార్యాలయంలో ఇంత జరుగుతున్న జిల్లా రిజిస్ర్టార్ కు మాత్రం తెలియదా? లేక మధ్యవర్తి మేనేజ్ చేస్తున్నాడా? అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
ఉన్నతాధికారులు సైతం మౌనం…?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు తమ హవాను కొనసాగిస్తూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఏ మాత్రం స్పందించక పోవడంపై నా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు ఏకంగా జూనియర్ అసిస్టెంట్ సీటు పక్కనే ఉండి వారి పత్రాలు చేయించడం అధికారులకు ఏమాత్రం కనిపించకపోవడం శోచనీయం. అయితే కార్యాలయంలో కాసులు సమర్పించి తమ పని చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోకపోవడంపైనా ఆ శాఖ ఉన్నతాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.