agri

Agri : పంటల సంరక్షణకు యాజమాన్య పద్ధతులు పాటించాలి

మంచిర్యాల జిల్లా వ్యవసాయశాఖ అధికారి కల్పన

Agri : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల నుండి పంటల సంరక్షణకు రైతులు యాజమాన్య పద్దతులు పాటించాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయశాఖ అధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలం నుంచి మురుగు నీటిని తీసివేయాలని డీఏవో సూచించారు. రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం పంట పొలాల్లో మందులను పిచికారీని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని డీఏఓ సూచించారు. వరి పంటలో ప్రస్తుతం దుబ్బు చేసే దశలో ఉందని, బ్యాక్టీరియా ఎండు ఆకు తెగులు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు 0.2 గ్రా॥ ప్లాంటమైసిన్ మందును లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలని, కాండం కుళ్ళు రావడానికి అవకాశం ఉన్నందున 2.5 గ్రా॥ కార్బెండజిమ్, మ్యాంకోజేబ్ శీలీంద్రనాశక మందును / ఒక మి.లీ. మైసిన్ వాలిడామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. అగ్గి తెగులు గమనించినట్లయితే 0.6 గ్రా॥ ట్రై సైక్లోజోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని, 2వ దఫా యూరియాను వేసుకోవడానికి అనుకూలమైన సమయమని, బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించి ఉన్నట్లయితే నత్రజని మోతాదుకు మించి ఉపయోగించకూడదని తెలిపారు.

వర్షాలు తగ్గిన తరువాత పత్తి పంటలో ఎకరాకు 25 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా పంటకు మొక్కల మొదళ్ళలో 7-10 సెం.మీ. దూరంలో పాదులు తీసి రసాయనిక ఎరువులను వేసి మట్టితో కప్పాలని, ముంపునకు గురైన పంట త్వరగా కోలుకోవడానికి 19:19:19 / 13-0-45 / 10 గ్రాముల యూరియా లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని సూచించారు. పిండి నల్లి రావడానికి అవకాశం ఉన్నందున ఎసిఫేట్ 1.5 గ్రా॥ / 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. నేల ద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు నివారణకు మూడు గ్రాములకాపర్-ఆక్సి-క్లోరైడ్ / ఆల్టర్నేరియా, ఆకు మచ్చ తెగులుకు 2.5 గ్రాముల కార్బెండజిమ్, మ్యాంకోజేబ్ శిలీంద్రనాశక మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేలా వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని తెలిపారు.

మక్కజొన్న పంటలో నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలు ఊదారంగులోకి మారే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పంట మోకాలు ఎత్తు నుంచి జల్లు కట్టే దశ వరకు ఉన్నందున వర్షాలు నిలిచిన తర్వాత మోకాలు ఎత్తు దశలో ఉన్న పంటకు 5 గ్రాముల 19-19-19 / 20గ్రాముల డీఏపీ మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలని సూచించారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత వర్షాధార పంటకు పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ ను వేసుకోవాలని తెలిపారు. బ్యాక్టీరియా కాండం కుళ్లు తెగులు నివారణకు బ్లీచింగ్ పౌడర్ ఐదు కిలోలు వేసుకోవాలన్నారు. కత్తెర పురుగును కూడా గమనించుకుంటూ అవసరమైనట్లయితే 0.3 మి.లీ. క్లోరైంటిని పోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటల సంరక్షణకు రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడి సాధించి లబ్ధి పొందాలని తెలిపారు.

    – శెనార్తి మీడియా, మంచిర్యాల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *