Mumbai firing Case: సల్మాన్‌ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనకు సంబంధించి రోజుకో విషయం బయటికి వస్తున్నది. ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సల్మాన్ ఖాన్, అతని సోదరుడు అర్బాజ్ ఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత లారెన్స్ బిష్ణోయ్‌ని సబర్మతి జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాల్పుల అనంతరం సల్మాన్ ఖాన్ వాంగ్మూలం తీసుకునేందుకు క్రైమ్ బ్రాంచ్ బృందం జూన్ 4న అతని ఇంటికి చేరుకుంది. గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో కాల్పులు జరిగినప్పుడు, సల్మాన్ ఇంట్లోనే ఉన్నాడు. ఈ ఘటన జరిగి దాదాపు నెలన్నర దాటింది.
జూన్ 4న మధ్యాహ్నం 12 గంటల సమయంలో నలుగురు క్రైమ్ బ్రాంచ్ అధికారులు సల్మాన్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. సల్మాన్ ఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్ బృందానికి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. కాగా అర్బాజ్ ఖాన్ వాంగ్మూలాన్ని 2 గంటల్లోనే నమోదు చేశారు. సాయంత్రం 5.30 గంటలకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బృందం 9 పేజీలకు పైగా వివరాలు నమోదు చేసుకొని సల్మాన్ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బృందం సల్మాన్ ఖాన్, అతని సోదరుడు అర్బాజ్ ఖాన్‌లను దాదాపు 150 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, కాల్పులు జరిగిన రోజు రాత్రి సల్మాన్ ఖాన్ ఇంట్లో పార్టీ జరిగినట్లు కూడా వెల్లడైంది. పార్టీ ముగిసిన తర్వాత సల్మాన్ ఆలస్యంగా నిద్రపోయాడు. అయితే తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బుల్లెట్లు పేలడంతో సల్మాన్ కాల్పుల శబ్దానికి నిద్ర నుంచి లేచాడు. ఈ సంఘటన చాలా తీవ్రమైనదని, ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసుల పని తీరును సల్మాన్ ప్రశంసించాడు.
సల్మాన్‌ఖాన్ కాల్పుల కేసులో ఇప్పటి వరకు 29 మంది వాంగ్మూలాలను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమోదు చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు సల్మాన్ తండ్రి సలీం ఖాన్ కూడా ఇంట్లోనే ఉన్నారు. సలీం ఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేయలేదని సమాచారం. వృద్ధాప్యం కారణంగా పోలీసులు అతడిని ప్రశ్నించలేదు. అవసరమైతే అతని వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రధాన నిందితుడు లారెన్స్ బిష్ణోయ్‌ని సబర్మతి జైలు నుంచి కస్టడీలోకి తీసుకునే ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని పోలీసు అధికారి తెలిపారు.