Old Mobile Phones :పాత మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ఇక పనికిరాదని పడేయాలనిపిస్తుందా? ఒక్కసారి ఆగండి. ఎందుకంటే వీటిల్లో దాగి ఉన్న బంగారాన్ని శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిలో వెలికితీస్తున్నారు. అంతేకాదు, ఈ సాంకేతికత పర్యావరణానికి హితంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ-వేస్ట్ పెరుగుదల
ప్రతి సంవత్సరం కోట్ల టన్నుల ఎలక్ట్రానిక్ వేస్ట్ ప్రపంచవ్యాప్తంగా పేరుకుపోతోంది. 2022లోనే సుమారు 6.2 కోట్ల టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి అయిందని UN రిపోర్ట్ పేర్కొంది. 2030 నాటికి ఇది 8.2 కోట్ల టన్నులకు చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ వేస్ట్‌లో బంగారం, వెండి, అరుదైన లోహాలు దాగి ఉన్నప్పటికీ, వాటిలో కేవలం కొద్ది శాతం మాత్రమే తిరిగి వాడుతున్నారు. మిగతావి వృథా అవుతున్నాయి.
కొత్త ఆవిష్కరణ
పాత ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి బంగారం తీయడానికి శాస్త్రవేత్తలు పర్యావరణానికి హాని చేయని కొత్త పద్ధతిని కనిపెట్టారు. ఈ ప్రక్రియలో సాధారణంగా స్విమ్మింగ్‌పూల్స్‌లో వాడే trichloroisocyanuric acid అనే కెమికల్‌ను వాడి, బంగారాన్ని కరిగిస్తారు. తర్వాత ప్రత్యేకమైన పాలీసల్ఫైడ్ పాలిమర్ సోర్బెంట్‌తో కరిగిన బంగారాన్ని వేరుచేస్తారు. ఈ పాలిమర్ మళ్లీ రీసైకిల్ చేయదగినది. చివరికి శుద్ధి చేసిన బంగారం అధిక నాణ్యతతో లభిస్తుంది.
ఈ విధానం ఖరీదైన కెమికల్స్ అవసరం లేకుండా, పర్యావరణానికి హాని చేయకుండా బంగారం వెలికితీయడంలో పెద్ద మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.