Flax Seeds :జుట్టు పొడిగా, జీవం లేని విధంగా మారుతుంటే ఇంట్లో తయారయ్యే సహజ చికిత్సలు ఎంతో మేలు చేస్తాయి. వాటిలో అవిసె గింజలతో తయారయ్యే హెయిర్ ప్యాక్ ఒకటి. ఇది తల చర్మానికి పోషణను అందించి, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చాలా మందికి చాలావిధాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించదు. అలాంటివారు ఒక్కసారి ఈ చిట్కా పరీక్షించండి. మీ జుట్టులో మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది.
అవిసె గింజల్లో లభించే పోషకాల ప్రభావం
ఈ గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియం వంటి పుష్కల పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు ఎదుగుదలకు, ములాలు బలపడటానికి సహాయపడతాయి. అంతేకాక, హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో కూడా ఉపయోగపడతాయి. జుట్టుకు నేరుగా పెట్టే అవకాశం లేకపోతే, పొడిగా చేసి అన్నంలో కలిపి తింటే కూడా ప్రయోజనం ఉంటుంది.
అవిసె గింజల నూనెతో తల మర్దన
అవిసె గింజల నూనెను కొద్దిగా వేడి చేసి తల చర్మంపై మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల కొత్త జుట్టు మొలకలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నూనెను తలకు పట్టించి, వేడి తువాళితో తల చుట్టి సుమారు అరగంట పాటు ఉంచాలి. ఆ తర్వాత సాదా షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడుసార్లు చేస్తే మంచి మార్పు కనబడుతుంది.
అవిసె గింజల జెల్ తయారీ విధానం
అర కప్పు అవిసె గింజలు తీసుకుని వాటిలో రెండు కప్పుల నీరు పోసి మరిగించాలి. అవసరమైతే కొంచెం నిమ్మరసం కలపవచ్చు. మిశ్రమం బాగా చిక్కగా మారాక దాన్ని వడగట్టి చల్లార్చాలి. వచ్చిన జెల్‌ను గాజు సీసాలో భద్రపర్చుకుని తలస్నానానికి ముందు తల చర్మంపై అప్లై చేయాలి. ఇలా వాడటం వలన జుట్టు మృదువుగా, మెరిసేలా మారుతుంది.
అవిసె గింజల హెయిర్ ప్యాక్
జుట్టు పొడిగా, శుష్కంగా ఉన్నపుడు రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజల పొడిలో అర కప్పు పెరుగు, నాలుగు చుక్కల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలపై పూర్తిగా పట్టించి అరగంట పాటు ఉంచిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు తేమతో నిండి, మృదువుగా మారుతుంది.