Virat Kohli: భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత క్రికెట్ లో కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్. కోహ్లీపై భారత్‌కు ఎంతో నమ్మక ఉంది. విరాట్ ఒంటి చేత్తో టీమిండియాను ఎన్నో మ్యాచ్‌లలో గెలిపించాడు. కానీ, క్రికెట్‌లో ప్రతి రోజు కొత్తదే. ఇక్కడ ప్రతి మ్యాచ్ లో తనను నిరూపించుకోవాల్సిందే. అది జట్టు కావచ్చు.. లేదా ప్లేయర్ కావచ్చు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌లు ఆడిన తర్వాత, టీమ్ ఇండియా తనను తాను నిరూపించుకుంటున్నట్లు కనిపిస్తోంది. కానీ, తనను తాను నిరూపించుకోడంతో విరాట్ విఫలమవుతున్నాడు. ఫామ్ కోల్పోతున్న విరాట్ ఇప్పుడు టీమిండియాకు అవసరం లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఈ సందేహాలకు సమాధానం కష్టమే. సమస్య తలెత్తినప్పుడు దానికి కారణం ఉండాలి. మరి, విరాట్ రాణించకున్నా టీమ్ ఇండియా టీ20 ఫార్మాట్‌లలో విజయాలు సాధిస్తు్న్నది. ఈ తరుణంలో విరాట్ అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2024 మొదటి నాలుగు మ్యాచ్‌లలో స్కోర్ చూస్తే టీమిండియా విజయంలో విరాట్ సహకారం చాలా తక్కువనేది స్పష్టమవుతున్నది.
టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ దశలో విరాట్ మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. ఐపీఎల్ 2024లో చాలా పరుగులు చేసిన తర్వాత విరాట్ కోహ్లీ 2024 టీ20 ప్రపంచకప్ జట్టులోకి ఎంపికయ్యాడు . కోహ్లీ పరుగుల వరద పారిస్తాడని అంతా భావించారు. కానీ, ఈ ఐసీసీ టోర్నమెంట్లో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఆటగాళ్లలో, కోహ్లీ ఆట తీరు అత్యంత నిరాశజనకంగా ఉంది. గ్రూప్ దశలో ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లో విరాట్ 10 బంతులు కూడా ఆడలేకపోయాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 9 బంతులు ఆడిన కోహ్లీ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.
సూపర్-8 మొదటి మ్యాచ్‌లో స్ట్రైక్ రేట్ 100
గ్రూప్ దశలో విరాట్ విఫలమైనా టీమ్ ఇండియా విజయాలు సాధిస్తూనే ఉంది. ఇప్పుడు సూపర్-8లో టీమిండియా ఒక మ్యాచ్ కూడా గెలిచింది. పోటీ ఎక్కువ కావడంతో ఇప్పుడు విరాట్ కోహ్లి ఆట ఏ స్థాయిలో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కొంత మెరుగ్గానే ఉన్నా హీరో ఆఫ్ ది మ్యాచ్ అనిపించేంత మాత్రం లేదు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సూపర్-8 తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు. 100 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసినా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలికి సరితూగడం లేదు. ప్రస్తుతానికి విరాట్ వైఫల్యం టీమ్ ఇండియాపై ప్రభావం చూపడం లేదు. ఇతర ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తుండడంతో భారత్ ప్రత్యర్థి జట్లపై విజయాలు సాధిస్తున్నది.
టీ20తో విరాట్ కెరీర్ ముగిసినట్లేనా?
విరాట్ కోహ్లీ లేకుండా టీ20 క్రికెట్‌లో టీమ్ ఇండియా విజయాలు సాధిస్తున్నది. ఈ ఫార్మాట్‌లో విరాట్ అవసరం ఇంకా ఉన్నదా? అతని స్థానంలో మరో యువ ఆటగాడికి అవకాశం ఇస్తే మంచిదనే చర్చ కూడా జరుగుతున్నది. ప్రస్తుతానికైతే ఇది సాధ్యం కాదు. కానీ ఈ టోర్నమెంట్ తర్వాత ఇది జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.