Nadipally Divakar Rao

Nadipally Divakar Rao : 70 ఏళ్ల యువ లీడర్ నడిపెల్లి

పదవి ఉన్నా లేకున్నా.. ప్రజాక్షేత్రంలో
కార్యకర్తలకు అండగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
వయోభారాన్ని  సైతం లెక్క చేయకుండా ఆందోళనల బాట
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిత్యం ప్రజల్లో..
స్థానిక ఎమ్మెల్యే ఆగడాలకు ఆందోళనలతో చెక్ పెడుతున్న వైనం

Nadipally Divakar Rao : 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం.. ఏడు పదుల వయసు. తీరిగ్గా మనువలు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన సమయం. గత ఎన్నికల్లో ఓటమి. పైగా ఇప్పుడు ఇంకా ఎన్నికలు కూడా లేవు. మరో నాలుగేళ్ల సమయం ఉంది. ప్రజాప్రతినిధిగా పదవి లేకుంటే కొందరు లీడర్లు బయటికి రారు. ఎదిగిన కొడుకు రాజకీయాల్లో ఉన్నా పాలిటిక్స్ కు దూరంగా జరగలేదు. తాను ఉన్న పార్టీ సైతం అధికారంలో లేదు. పార్టీలోనూ చెప్పుకోదగ్గ పదవి లేదు. కానీ ఇవేమీ లెక్క చేయకుండా 70 ప్లస్ వయసులో పదవి ఉన్నా లేకున్నా యువకులకు సవాల్ విసురుతున్నాడు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు (Nadipally Divakar Rao). బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా అందరి కంటే ముందుటున్నాడు. మంచిర్యాల జిల్లాలో అటు పార్టీకి, ఇటు కార్యకర్తలకు పెద్ద దిక్కుగా నిలుస్తున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అందరి లీడర్ల కంటే చాలా చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు 1953లో ఉమ్మడి ఆదిలాబాద్‌లో జన్మించారు. బీఏ వరకు చదువుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యవసాయం చేశారు. కాంగ్రెస్ పార్టీ లో చేరి దివాకర్ రావు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1981లో మంచిర్యాల మున్సిపాలిటీ వార్డు మెంబర్‌గా ఎన్నికయ్యారు. 1983-1992 వరకు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 1987లో ఆసిఫాబాద్ డివిజన్‌లో అత్యధిక మెజారిటీతో మంచిర్యాల మండల సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1989 నుంచి 1999 వరకు పదేళ్లపాటు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి లక్సెట్టిపేట (అసెంబ్లీ నియోజకవర్గం) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2014లో సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అరవింద్ రెడ్డిపై 59 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ టికెట్ పై నుంచి పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై 4 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

కార్యకర్తలతో కలిసి బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

స్తబ్దుగా బీఆర్ఎస్.. యాక్టివ్ గా దివాకర్ రావు
తెలంగాణ రాష్ర్టంలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం చెందడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిస్తేజం ఆవరించింది. బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీపై ఆందోళనలకు పిలుపునిస్తున్నది. అధికారం పోవడంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్దగా ముందుకు రావడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కూడా పార్టీ చేపట్టే ఆందోళనల్లో పెద్దగా పాల్గొనడం లేదు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం మిగతా వారికంటే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సఫలమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా మంచిర్యాలలో పార్టీ కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయి. కరెంటు కోతలు, రుణమాఫీ, బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గనులపై నిరసనలు, కాళేశ్వరం నీటి విడుదలకు సంబంధించి బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలను దివాకర్ రావు తన భుజాన వేసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు.

ఆందోళనలో కార్యకర్తలతో నడిపెల్లి దివాకర్ రావు
ఆందోళనలో కార్యకర్తలతో నడిపెల్లి దివాకర్ రావు

బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నంపై ఆందోళన..
మూడు రోజుల క్రితం నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన వార్డు కౌన్సిలర్ బేర సత్యనారాయణ మంచిర్యాల ఏసీపీ ఆఫీసులో బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. తమ అనుచరుడిపై ఒత్తిళ్లను నిరసిస్తూ దివాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు తన పార్టీ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేయగా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పీఎస్సార్ ఆగడాలపై విరుచుకుపడ్డారు.

కార్యకర్తలకు దూరంగా బెల్లంపల్లి, చెన్నూర్ అభ్యర్థులు
బీఆర్ఎస్ నుంచి బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ  స్థానాల్లో  ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్ తమ నియోజకవర్గంలో పెద్దగా కానరావడం లేదు. స్థానికంగా ఉండే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య అసలు నియోజకర్గంలోనే పెద్ద గా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో సైతం తప్పదన్నట్లుగా కనిపిస్తున్నారు. కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నాడనే విమర్శలు ఉన్నాయి. పార్టీ పరంగా ఏదైనా పెద్ద కార్యక్రమం ఉంటే తప్ప జిల్లాకు రావడం లేదు. వచ్చినా ఉదయం వచ్చి రాత్రయ్యిందంటే జిల్లాలో పొరపాటున కూడా కనిపించడం లేదని కార్యకర్తలు గొణుక్కుంటున్నారు.

ఆందోళనలో కార్యకర్తలతో నడిపెల్లి దివాకర్ రావు
ఆందోళనలో కార్యకర్తలతో నడిపెల్లి దివాకర్ రావు

వయోభారం దరి చేరనివ్వకుండా..
బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని ఓ పక్క కాంగ్రెస్ భావిస్తుండగా, మంచిర్యాలలో వాటిని తిప్పికొడుతున్నారు నడిపెల్లి దివాకర్ రావు. తన వయసు సహకరించకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పడుతున్నారు. దివాకర్ రావు చురుకుదనాన్ని చూసి పార్టీ కార్యకర్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. వయోభారాన్ని ఏ మాత్రం దరి చేరనివ్వడం లేదంటున్నారు ఆయన వెంట ఉంటున్న కార్యకర్తలు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *