చెన్నూర్ లో శనిగకుంట పేలుడు చిచ్చు..
వర్గాలుగా విడిపోతున్న అధికార పార్టీ నాయకులు
Shanigakunta Issue: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ పాలిటిక్స్ రోజుకో మలుపుతిరుగుతుున్నాయి. ఎమ్మెల్యే వర్సెస్ షాడో ఎమ్మెల్యే గా ఆధిపత్య పోరు సాగుతుందనే చర్చ ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. శనిగకుంటకు దాపురించిన “శని” తిరిగి తిరిగి అధికార పార్టీ రాజకీయ నాయకులకు చుట్టుకుంటున్నది. అధికారంలో ఉన్నాం.. మనల్ని ఎవరేం చేస్తారులే అనుకున్న నాయకులకు ఉచ్చు బిగుస్తున్నది. అంతర్గత కుమ్ములాటలతో ఈ విషయం బయటపడుతుందా.. లేక సెటిల్ మెంట్ చేసుకుంటారా అనే చర్చ జోరుగా సాగుతున్నది.
శనిగకుంట విస్తీర్ణం ఎంత…?
శనగకుంట చెరువు 348, 365 సర్వే నంబర్లలో సుమారు 39 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఎఫ్టీఎల్ 42 ఎకరాలు, శిఖం 33.22 ఎకరాల్లో ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్వలాభం కోసం చెరువు మత్తడిని డిటోనేటర్లతో పేల్చేశారు. దీంతో చెరువుపై ఆధారపడి 43 ఎకరాల్లో సాగుచేస్తున్న రైతులకు నష్టం వాటిల్లున్నది. చెరువులో చేప పిల్లలు వేసిన మత్స్యకారులూ తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు ప్రజలంతా ముక్తకంఠంతో దోషులను శిక్షించాలనే డిమాండ్ పెరుగుతున్నది. మొదట ఏదో నామమాత్రంగా విచారణను ప్రారంభించిన పోలీసులు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాస్తవాలను బయటికే తీసే పనిలో పడినట్లు తెలుస్తున్నది.
చెన్నూర్ మే క్యా చల్..రా?
శనిగకుంట మత్తడి పేల్చివేత కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. పేల్చివేతకు పాల్పడింది వీరేనంటూ పోలీసులు మొదట కొందరిని అరెస్టు చేసి మీడియాకు వెల్లడించారు. ఎఫ్ఏల్లో మట్టి నింపిన వారిని, జిలిటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే దానిని విస్మరించడంపై పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వైపుగా విచారణ జరిపి అరెస్టు చూపే ప్రయత్నం చేసి వదిలిపెట్టారు.
జిలెటిన్ స్టిక్స్ ఎక్కడివి..?
జిల్లాలో ఓపెన్ కాస్టులు, భూగర్భ గనుల్లో ఉపయోగించే మందుగుండును శనిగకుంట మత్తడి పేల్చివేతలోనూ వాడినట్లు తెలుస్తున్నది.అసలు ఈ మందు గుండు సామగ్రి ఇక్కడి ఎలా తెచ్చారు. ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? పేల్చివేతకు ఎన్ని వినియోగించారు. పేల్చి వేతకు ఉపయోగించని ఇంకా ఏమైనా ఉన్నాయా? ఒక వేళ అవి జనావాసాల మధ్య భద్రపరిస్తే పరిస్థితి ఏమిటి? అనే సందేహాలు చెన్నూర్ పరిసర ప్రాంత ప్రజల్లో వెల్లువెత్తున్నాయి.
సహకరించింది షాడో ఎమ్మెల్యేనేనా?
మరోవైపు షాడో ఎమ్మెల్యే బంధువు ఒకరు సింగరేణి బొగ్గు గనుల్లో ఒక ఎక్స్ ప్లోజివ్ మ్యాగ్జిన్ (లారిక్)కు మేనేజర్ గా పని చేస్తున్నారని, ఆయనే వీటిని తీసుకువచ్చారనే అనుమానాలు సైతం చెన్నూర్ ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. మొదట పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించిన విషయాలపై ప్రజల్లో అనుమాల వ్యక్తమవుతున్నాయి. పోలీసులు చెప్పినట్టుగా పేలుడు పదార్థాలను ఖమ్మం నుంచి ఇంత దూరం ఎలా తీసుకువచ్చారంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంలో పోలీసులు సైతం విచారణ జరుపుతున్నామంటూ దాటవేస్తున్నారే తప్ప వాస్తవాలు వెల్లడించలేదని అనుమాలు నెలకొన్నాయి.
చెన్నూర్ లో అధికార పార్టీలో రగడ..
శనిగకుంట మత్తడి బ్లాస్టింగ్ కేసు చెన్నూర్ ఎమ్మెల్యేకు, షాడో ఎమ్మెల్యేగా ఓ కాంగ్రెస్ నాయకుడి మధ్య అంతర్గత పోరు సాగుతున్నట్లు సమాచారం. మత్తడి పేల్చివేతకు కారణం ఎవరైనా వారికి శిక్ష తప్పదని ఎమ్మెల్యే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితులను రక్షించేందుకు షాడో ఎమ్మెల్యే రంగంలోకి దిగాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే అరెస్టు చేసిన నాయకులను సైతం పోలీసులు వదిలారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వివేక్ శనివారం చెన్నూర్ లో నిర్వహించిన మహాలక్ష్మీ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సైతం సదరు షాడో ఎమ్మెల్యే, పేల్చివేత కేసులో అనుమానితులుగా ఉన్న వారెవ్వరూ హాజరు కాలేదని స్పష్టమైంది. పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా షాడో ఎమ్మెల్యే ఇంట్లోనే అందరు మకాం పెట్టారని తెలిసింది. తమకు మద్దతివ్వకుంటే పార్టీకీ రాజీనామా చేస్తామని, ఎందులోనూ సహకరించమనే సంకేతాలను ఆ వర్గం తరపున ఎమ్మెల్యేకు చేరవేసినట్టు సమాచారం. అసలు ఎమ్మెల్యే వారికి లొంగి నిందితుల వైపు నిలుస్తారా..? లేక న్యాయం కోసమే పోరాడుతారా..? ఎవరిది పైచేయి అవుతుందోనని ప్రతిపక్ష పార్టీల నాయకులు గుసగులాడుకుంటున్నారు.
ప్రధాన నాయకుల మెడ చుట్టే…?
చెరువు బ్లాస్టింగ్ కేసులో చెన్నూర్‌లో రాజకీయం ఒక్కసారి వేడెక్కింది. అధికార పార్టీ ప్రధాన నాయకులు, షాడో ఎమ్మెల్యే గా పేరొందిన నాయకుడు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావడం చెన్నూర్ రాజకీయాల్లో కలవరం రేపుతున్నది. పంతం గెలిచేనా.. న్యాయం గెలిచేనా అన్నట్లుగా ఉన్నది. మత్తడి బ్లాస్టింగ్ వెనుక అసలు మతలబు ఏమిటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
శెనార్తి మీడియా, మంచిర్యాల