- మంచిర్యాలలో వారం రోజుల్లో ఇద్దరు మృతి
- ఇంజెక్షన్ వికటించి యువతికి బ్రెయిన్ డెడ్
- వారం క్రితం లక్షెట్టిపేటలోనూ ఇదే తరహాలో ఘటన
RMP Treatment : చిన్నపాటి, జ్వరం, దగ్గు వస్తే స్థానికంగా ఉండే ఆర్ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తుంటారు ప్రజలు. కానీ మంచిర్యాలలో ఆర్ఎంపీలు, పీఎంపీల దగ్గరికి వెళ్లడానికి జంకుతున్నారు ప్రజలు. లక్షెట్టిపేటలో పది రోజుల క్రితం ఓ యువకుడు జ్వరం వచ్చిందని ఆర్ఎంపీ దగ్గరకు వెళితే ఇంజక్షన్ ఇచ్చాడు. అది వికటించడంతో బ్రెయిన్ డెడ్ అయ్యింది. హైదరాబాద్; మంచిర్యాలలో చికిత్స పొందినా పరిస్థితి విషమించి వారం క్రితం చనిపోయాడు. ప్రస్తుతం అదే తరహాలో నస్పూర్ లో ఓ పీఎంపీ వైద్యం వికటించి ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది.
బాధిత కుటుంబం, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని నాగార్జున కాలనీకి చెందిన చింతం శ్రీలత (24) కు రెండు రోజులుగా జ్వరం వస్తుండడంతో స్థానికంగా ఉండే ఓపీఎంపీ వద్దకు వెళ్లింది. సదరు పీఎంపీ పీసీఎం (పారసిటమల్) ఇంజక్షన్ వేశాడు. అనంతరం మరో ఇంజక్షన్ వేయడంతో చలితో మరింత బాధపడింది. అంతలోనే వాంతులు, విరేచనాలతో మరింత అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె భర్త రాజు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు పరిస్థితి విషమించిందని కరీంనగర్ తీసుకెళ్లమని సూచించారు. అక్కడి వైద్యులు తాము టేకప్ చేయలేమని, హైదరాబాద్ కు తీసుకెళ్లమని చెప్పారు. అక్కడ వైద్య పరీక్షలు చేయగా బ్రెయిన్ డెడ్ అయ్యిందని డాక్టర్లు వివాహిత కుటుంబ సభ్యులకు తెలిపారు.
పోలీసుల అదుపులో వైద్యుడు…
నాగార్జున కాలనీలో వైద్యం వికటించి వివాహిత బ్రెయిన్ డెడ్ అయ్యిందని తెలిసిన వెంటనే పోలీసులు పీఎంపీని అదుపులోకి తీసుకున్నారు. సదరు పీఎంపీ వేసిన ఇంజక్షన్లు, సెలైన్లు స్వాధీనం చేసుకొని వెళ్లారు. అనంతరం పీఎంపీ క్లినిక్ ను తనిఖీ చేశాడు. పక్కనే ఉన్న మహాలక్ష్మి మెడికల్ షాప్ నిర్వాకుడిని కూడా పోలీస్ స్టేషనకు తరలించారు. తదుపరి విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల