- కస్టమర్లకు పాడైపోయిన ఆహార పదార్థాలు సప్లై..
- ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్న నిర్వాహకులు
- ఫుడ్ ఇన్ స్పెక్టర్ ఉన్నట్టా..లేనట్టా?
శెనార్తి మీడియా, మంచిర్యాల:
Spoiled food: మిరమిట్ల గొలిపే విద్యుత్ లైట్లు, వెరైటీ రుచులంటూ ఆకర్షణీయమైన బోర్డులతో ఆకట్టుకుంటున్న హోటళ్ల నిర్వాహకులు నాణ్యత పాటించడం లేదు. కనిపించి, కనిపించని విద్యుత్ లైట్ల వెలుతురులో రెస్టారెంట్లలో కూర్చున్న కస్టమర్లకు నిర్వాహకులు కుళ్లిపోయిన, నాణ్యతలేని ఆహారం అంటగడుతు పబ్బం గడుపుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యంపై ఏ మాత్రం పట్టించుకోకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వివరాల్లోకి వెళితే… మంచిర్యాల పట్టణంలోని స్వాగత్ ఫ్రైడ్ రెస్టారెంటు నుంచి క్రాంతి అనే యువకుడు ఆన్‌లైన్‌లో ఎగ్ మంచూరియా ఆర్డర్ పెట్టాడు. తీరా అది ఓపెన్ చేస్తే కుళ్లిపోయిన గుడ్డు ముక్కలు, దుర్వాసన రావడంతో సదరు యువకుడు ఆ రెస్టారెంటు వెళ్లి ఆర్డర్ చేసిన ఎగ్ మంచూరియాను చూపించి నిర్వాహకులు ప్రశ్నించారు. నిర్వాహకుడు ఇదేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. లోపల ప్యాక్ చేసేది, చేసింది మాకెలా తెలుస్తుంది. నీకు ఇష్టమైంది చేసుకో, ఎవరికైనా చెప్పుకో, కౌంటర్ వద్దకు వచ్చి గొడవ చేశావంటూ నీ పైనే కేసు పెడుతానంటూ బెదిరింపులకు గురి చేశాడు. అంతే కాకుండా ఈ రెస్టారెంట్ ఓ కమ్యూనిస్టు పార్టీ నాయకుడి కొడుకుది కావడంతో వారి నుంచి సైతం ఫోన్లు వస్తుండటం కొసమెరుపు.
పట్టించుకోని అధికారులు…
నిత్యం ఆహార నాణ్యతను చూసే సంబంధిత శాఖ అధికారులు ఏమీ పట్టించుకోకపోవడంతో రెస్టారెంటు, హోటళ్ల నిర్వాహకుల వ్యాపారం మూడు పువ్వులు.., ఆరు కాయలుగా సాగుతున్నది. అసలు మంచిర్యాలలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో, లేదో కూడా తెలియడం లేదు. తనిఖీలు లేవు, పర్యవేక్షణ లేదు. అధికారులు వారి కనుసన్నుల్లో ఉండడంతోనే హోటళ్ల నిర్వాహకులు, ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఏం చేసుకుంటారో చేసుకోమన్నారు
క్రాంతి, ఫుడ్ ఆర్డర్ చేసిన బాధితుడు
మేం మంచిర్యాలలోని స్వాగత్ ఫ్రైడ్ రెస్టారెంట్ నుంచి ఎగ్ మంచూరియా ఆర్డర్ పెట్టాం. మాకు వచ్చిన పార్సిల్లో కుళ్లిపోయిన గుడ్లు వచ్చాయి. దుర్వాసన రావడంతో దానిని స్వాగత్ ప్రైడ్ రెస్టారెంటుకు వచ్చి చూపించాం. నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఏం చేసుకుంటారో చేసుకోండి, అన్నింటిని చూడలేం కదా అంటూ దురుసుగా సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ నాణ్యతలేని మంచూరియాను డస్ట్ బిన్లో పడేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తామంటే చెప్పుకోండి, మీరిక్కడ గొడవ చేయడానికి వచ్చారా.. వెళ్లండంటూ పంపించేశారు. అధికారులు స్పందించి ఇలాంటి రెస్టారెంట్లపై అదికారులు చర్యలు తీసుకోవాలి.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
వాసు, ఫుడ్ ఇన్ స్పెక్టర్, మంచిర్యాల
సాధారణ తనిఖీలు చేస్తున్నాం. అపరిశుభ్రమైన ఫుడ్, నాణ్యత లేనిది, కుళ్లిపోయిన ఆహారం ప్రజలకు సరఫరా చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రజలు సహకరించాలి, ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు తమకు సమాచారం ఇవ్వాలి. తనిఖీలను మరింత పెంచుతాం.