శెనార్తి మీడియా, మంచిర్యాల :
Triangle Fight For Ministry: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతుండడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మంచిర్యాల జిల్లా నుంచి త్రిముఖ పోరుతో పార్టీ అధిష్టానం సతమతవుతున్నది. మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో పాటు జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ ప్రస్తుతం మంత్రి పదవి రేసులో ఉన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి మంచిర్యాల జిల్లా వీరు ముగ్గురు మంత్రి పదవుల కోసం హైకమాండ్ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన…
ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రి పదవులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. మంత్రి పదవి కోసం ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మంచిర్యాల నుంచి గెలుపొందిన ప్రేమ్ సాగర్ రావు 2007-13 మధ్య కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా పనిచేశారు. 2018లో మంచిర్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పీఎస్ఆర్‌కు మంత్రి పదవి వస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి కుమారులు బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. 2004లో చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికై గడ్డం వినోద్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. గడ్డం వివేక్ 2009-14 వరకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. తిరిగి 2014లో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా నిలిచి చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన వెడ్మ బొజ్జు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి గిరిజన జిల్లాగా పేరుగాంచడంతో అదే సామాజికవర్గానికి చెందిన బొజ్జుకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం కూడా సాగుతోంది.
ఢిల్లీ చుట్టు చక్కర్లు, ప్రదక్షిణలు
మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండడంతో ఆశావహులు తమదైన శైలిలో ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లా నుంచి బరిలో ఉన్న ప్రేంసాగర్ రావు, వినోద్, వివేక్ సీనియర్లు కావడంతో ఢిల్లీలో సంబంధాలు ఉన్నాయి. ప్రేంసాగర్ రావుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఆయన అనుయాయులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నస్పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఖర్గే.. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే ప్రేంసాగర్‌రావుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. దీంతో ప్రేమ్ సాగర్ రావు ఇటీవల ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ నేతలతో చర్చలు జరిపారు. ఢిల్లీలోని పార్టీ అగ్రనేతలతో కూడా వినోద్, వివేక్‌లకు మంచి సంబంధాలు ఉన్నాయి. వీరు కూడా కొద్దిరోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి మంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే ప్రచారం జిల్లాలో ప్రస్తుతం జోరుగా సాగుతోంది.