Mohamed Muizzu

ముయిజ్జూ డబుల్ గేమ్

  • చర్చలంటూనే గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షలు
  • భారత్ కు వ్యతిరేకంగా నిర్ణయాలు
  • చైనాకు అనుకూలంగానే మాల్దీవుల అధ్యక్షుడి వైఖరి

Mohamed Muizzu : మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. భవిష్యత్ లో భారత్, మాల్దీవులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో చర్చలు జరిపిన ముయిజ్జూ సోమవారం కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్‌తోనూ సమావేశమయ్యారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారతదేశంలో ఉన్నప్పుడు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు, చారిత్రక సంబంధాలను పెంపొందించుకోవాలని చెబుతుండగా, అదే సమయంలో అతని దేశంలోని పార్లమెంటరీ కమిటీ మూడు ఒప్పందాలను సమీక్షిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, భారత అనుకూల నాయకుడు ఇబ్రహీం సోలిహ్ భారత్‌తో సంతకం చేశారు. ఇప్పుడు ఈ సమీక్ష వెనుక మాల్దీవుల సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లిందని చెబుతున్నారు. అంతే కాదు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ కూడా ఆ దేశంలో నిలిచిపోయింది.

మాల్దీవుల మీడియా నివేదికల ప్రకారం, మాల్దీవుల సార్వభౌమాధికారం, స్వాతంత్య్రాన్ని అణగదొక్కే సోలిహ్ పరిపాలన చర్యలపై దర్యాప్తు చేయడానికి పార్లమెంటు జాతీయ భద్రతా సేవల కమిటీ పార్లమెంటరీ విచారణను చేపట్టాలని నిర్ణయించినట్లు ఎంపీ అహ్మద్ అజాన్ తెలిపారు. పార్లమెంటరీ విచారణ ప్రారంభించాలని ప్రతిపాదించారు. గత ప్రభుత్వ చర్యలు దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేశాయని ఆరోపించారు. మాల్దీవుల జలాల్లో జాయింట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం భారత నౌకాదళంతో ఒప్పందాన్ని పునరుద్ధరించడం లేదని ముయిజు ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే.

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ భారత్‌లో ఉన్నప్పటికీ భారత్‌పై మాల్దీవుల ప్రభుత్వానికి ఉన్న ద్వేషం మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ముయిజు భారత్‌కు వచ్చారు. ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చే ముందు ముయిజు మాట్లాడుతూ.. నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వం కొత్త హయాంలో భారత్ -మాల్దీవుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవైపు సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే చర్చ జరుగుతుండగా, మరోవైపు మాల్దీవుల ప్రభుత్వ ప్రసార సంస్థ పబ్లిక్ సర్వీస్ మీడియా చివరి క్షణంలో మోదీ ప్రమాణ స్వీకారోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని రద్దు చేసింది.

గత ఏడాది నవంబర్ 17న మాల్దీవుల అధ్యక్షుడైన తర్వాత ముయిజ్జూ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ముయిజ్జూ వైఖరి చైనాకు అనుకూలంగా కనిపిస్తున్నది. మాల్దీవుల అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలకే, తన దేశం నుంచి భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల ప్రారంభంలో, భారత సైనిక సిబ్బంది స్థానంలో సాధారణ పౌరులు ఉన్నారు. భారతదేశం-మాల్దీవుల మధ్య ఇటీవల దెబ్బతిన్న సంబంధాల దృష్ట్యా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని, ఆ తర్వాత ఢిల్లీని సందర్శించాలని మయిజ్జూకు ఆహ్వానం పంపారు. అయితే తెగిపోయిన బంధాలు ఇప్పట్లో అతికేలా లేవని తెలుస్తోంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *