- డబ్బులు ఇవ్వాలంటూ ఆర్డర్..
- లేదంటే ఆందోళనలు చేస్తామంటూ బెదిరింపులు
శెనార్తి మీడియా, మంచిర్యాల :
Student Leader: నస్పూర్ లో బీసీ విద్యార్థి సంఘానికి చెందిన ఓ నాయకుడి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. శుక్రవారం ఓ ప్రైవేట్ పాఠశాలకు వెళ్లిన సదరు విద్యార్థి సంఘం నాయకుడు పాఠశాల యాజమాన్యం, అక్కడ పని చేస్తున్న మహిళలతో అగౌరవంగా మాట్లాడాడు. మీ సార్లు ఏదైనా కమిట్మెంట్ ఇస్తే తప్ప ఆందోళనలు ఆగవు.. లేకుంటే ప్రోగ్రాం ఫిక్స్ చేసి ఆందోళన చేస్తామని బెదిరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా మండలం మొత్తం వ్యాపించింది. టీచర్లకు జీతాలు ఇచ్చేది యాజమాన్యం, కట్టేది తాము, మధ్యలో మీరెందుకు వస్తున్నారు అంటూ పిల్లల తల్లిదండ్రులు సదరు నాయకుడి వైఖరిపై మండిపడ్డారు. డబ్బులే కావాలంటే వచ్చి తీసుకుపోవచ్చని, ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కొందరి తీరు వల్ల అన్ని విద్యార్థి సంఘాలకు చెడ్డపేరు వస్తుందనే చర్చ జరుగుతున్నది.
మరోవైపు ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, గురుకులం, కేజీవీబీ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లను సైతం బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల నస్పూర్ కేజీబీవీలో చదువుతున్న విద్యార్థినిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకపోవడం లేదనే బెంగతో హాస్టల్ నుంచి పారిపోయేందుకు బిల్డింగ్ పైనుంచి దూకితే కొన్ని విద్యార్థి సంఘాలు ఆత్మహత్య చేసుకోవడానికి దూకిందంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. తన తప్పేమీ లేదని మొత్తుకున్నా బ్లాక్ మెయిల్ చేయడం మాత్రం ఆపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ప్రభుత్వ మహిళా స్పెషల్ ఆఫీసర్ అని చూడకుండా కొందరు విద్యార్థి సంఘాల నాయకులు ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు ఇస్తేనే ఆందోళనలు ఆగుతాయి.. లేదంటే ప్రతి రోజు ఏదో కార్యక్రమం చేస్తూ ఇబ్బంది పెడతామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని సమాచారం. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలతో విద్యార్థి సంఘాల మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని కోల్పోతున్నారు.