తట్టుకోలేక రోడ్డెక్కిన స్టూడెంట్లు
స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తున్నదని ఆరోపణ
వేకువ జామున 5 గంటలకు సిద్దిపేట-సిరిసిల్ల రోడ్డుపై బైఠాయింపు
PET Harrasment : సిరిసిల్లలో ఓ పీఈటీ (PET)హద్దులు దాటి ప్రవర్తిస్తోందని, ఆమె వేధింపులు తట్టుకోలేక పాఠశాల, కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో జ్యోత్స్న పీఈటీగా పనిచేస్తున్నది. ఆమె తమ పట్ల అరాచకంగా ప్రవర్తిస్తోందని, గురువారం వేకువ జామున 5 గంటల సమయంలో విద్యార్థులు సిరిసిల్ల, సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. పీఈటీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. పీఈటీ తమను ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడుతున్నదని, ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నదని విలపించారు. విద్యా బుద్ధులు నేర్పే గురువే.. దుర్భాషలాడితే ఆమె నుంచి తాము ఏం నేర్చుకోవాలి.. ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. తన తరగతి గదుల్లోనూ వేధిస్తోందని, స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తున్నది, రక్తం వచ్చేలా కొడుతోందని వాపోయారు. ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు చెప్పినా, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 580 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల, కళాశాలలో కనీస వసతులు కూడా లేవని అన్నారు.
ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఈవో, పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు తమ నిరసనను విరమించేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఎంఈవో రఘుపతి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కొనసాగుతున్న పీఈటీ జ్యోత్స్నను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు.
శెనార్తి మీడియా, రాజన్న సిరిసిల్ల: