- మందు బాబులు, పేకాటరాయుళ్లకు నో టికెట్స్
- మంచిర్యాల జిల్లాలో అంతర్గత చర్చ
PSR : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇటీవల తన అనుచరులకు కొన్ని కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా, మద్యం తాగే వారికీ టిక్కెట్లు ఇవ్వవద్దని బహిరంగంగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం సర్పంచ్లు, మున్సిపాలిటీలోని నాయకులకు ఆందోళన కలిగించింది. ప్రస్తుతం, వారందరూ తమ భార్యలకు టిక్కెట్లు ఇప్పించేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో మహిళలకు ఇచ్చిన టిక్కెట్లను యధావిధిగా వారికి కొనసాగించాలని ప్రేమ్ సాగర్ రావు అనుకుంటున్నారని సమాచారం. మద్యం తాగేవారికి టికెట్లు ఇవ్వవద్దని ఆయన చేసిన సూచనతో మహిళలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఇక, 10 సంవత్సరాలుగా తన వెన్నంటే ఉండి, తన ఓటమి గెలుపును భుజాలపై మోసిన కార్యకర్తలను తాను ఎప్పటికీ మరచిపోనని ప్రేమ్ సాగర్ రావు అనేక సందర్భాల్లో స్పష్టంచేశారు. అయితే, ఈ సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తులు కూడా టికెట్ల కోసం ప్రయత్నిస్తుండటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం, నిధులను సమకూర్చడం ద్వారా ప్రజల్లో ప్రేమ్ సాగర్ రావు (పి.ఎస్.ఆర్.) విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. ఏదేమైనా, ప్రేమ్ సాగర్ రావు తీసుకున్న ఈ నిర్ణయం నియోజకవర్గ అభివృద్ధికి దోహదం చేస్తుందని మేధావులు భావిస్తున్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల