కోహ్లీ, వార్నర్ సరసన మహేంద్ర సింగ్
MS Dhoni IPL Record : ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి విజయపథంలో నడిపించాడు. 2025 సీజన్‌లో, రెండు సంవత్సరాల విరామం తర్వాత కెప్టెన్‌గా నిలిచిన ధోనీ, జట్టును విజయతీరాలకు చేర్చినాడు. లక్నోపై కీలక మ్యాచ్‌లో 26 పరుగులు చేసి చెన్నై విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 30వ మ్యాచ్ ఎకానా స్టేడియంలో చెన్నై- లక్నో జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. ఈ పోరులో చెన్నై ఐదు వికెట్ల తేడాతో విజయ తీరాలకు చేరింది. ఈ విజయం ద్వారా చెన్నై గత ఐదు పరాజయాలకు అడ్డుకట్ట వేసింది. శివం దూబేతో కలిసి ధోనీ 5వ వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యంతో విజయానికి దారి తీసాడు. చెన్నై 167 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే ఛేదించింది.
శివం దూబే 37 బంతులు ఎదుర్కొని 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ధోనీ 11 బంతులు ఎదుర్కొని 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో ఆడిన ఆ ఇన్నింగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత ధోనీ ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. చివరిసారిగా 2019లో ఢిల్లీపై 44 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌కి ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నాడు.
ఈ విజయంతో, ధోనీ 43 సంవత్సరాలు 282 రోజులు వయస్సులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన అరుదైన ఘనతను సాధించాడు. అంతేగాక, ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ మరియు డేవిడ్ వార్నర్‌తో సమంగా మొత్తం 18 సార్లు ఈ అవార్డును గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్‌లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు:
- 25 – ఎబి డివిలియర్స్
- 22 – క్రిస్ గేల్
- 19 – రోహిత్ శర్మ
- 18 – ఎంఎస్ ధోని
- 18 – డేవిడ్ వార్నర్
- 18 – విరాట్ కోహ్లీ
ధోనీ స్పందన: విజయం అనంతరం తన ఆనందాన్ని ధోనీ వ్యక్తం చేశాడు. “ఇలాంటి పోటీలు ఆడుతున్నప్పుడు, విజయం చాలా ముఖ్యమైనది. గత మ్యాచ్‌ల్లో జట్టు అనేక సమస్యలను ఎదుర్కొంది. కానీ ఈ విజయం జట్టుకు మేలు చేస్తుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బౌలింగ్ విభాగం బాగా రాణించగా, బ్యాటింగ్ విభాగం ఇంకాస్త మెరుగవ్వాలి. కొన్ని కీలక సమయంలో వికెట్లు కోల్పోయాం. కానీ చివరికి మంచి ఫలితం దక్కింది,” అని అన్నాడు.