sheikh-hasina

Sheik Hasina: ఎలా మొదలైందో.. అలాగే ముగిసిన హసీనా కథ

Sheik Hasina: షేక్ హసీనా రాజకీయ జీవితంహింసతో మొదలై హింసతోనే ముగిసింది! షేక్ హసీనా 1947లో జన్మించారు. ఆమె ముజీర్‌బుర్ రెహమాన్ పెద్ద కూతురు. 1975లో తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ (Mujibur Rehaman) హత్యకు గురికాకుంటే బహుశా ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి ఉండకపోయేదేమో. ఆమె తన భర్తతో కలిసి జర్మనీకి వెళ్లింది. కానీ 49 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్‌లో జరిగిన సంఘటన ఆమెను బంగ్లా రాజకీయాల్లో బలమైన మహిళగా మార్చింది.

1975 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న సమయం. కానీ బంగ్లాదేశ్‌లో మాత్రం ఆ రోజు చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలింది. ఆగస్ట్ 15, 1975న ఢాకాలోని ధన్మోడీ ప్రాంతంలోని రాష్ట్రపతి నివాసంపై బుల్లెట్ల వర్షం కురిసింది. బుల్లెట్ల శబ్ధం ఆగిపోగానే ఓ వ్యక్తి గదిలోంచి బయటకు వచ్చాడు. ఈ వ్యక్తి మరెవరో కాదు.. అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్. షేక్ హసీనా తండ్రి. అతను గది నుంచి బయటకు వచ్చినప్పుడు హింసాత్మక గుంపులో ఉన్న యువకులు అతడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. షేక్ ముజిబుర్ రెహమాన్ నేలపై పడగా, 18 రౌండ్లు కాల్చారు. ఈ ఘటనలో ఆ కుటుంబం అంతా తుడిచి పెట్టుకుపోయిందని అంతా భావించారు. కానీ.. మరో ఇద్దరు మిగిలారు.
అల్లరిమూకల గుంపు ముజీర్‌బుర్ రెహమాన్ కుటుంబం మొత్తాన్ని అంతమొందించామనే నమ్మకంతో వెళ్లి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు. ఈ దాడిలో కుటుంబంలోని ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో ఒకరు షేక్ హసీనా కాగా మరొకరు ఆమె సోదరి షేక్ రెహానా. బంగ్లాదేశ్‌కు ఐదుసార్లు ప్రధానిగా అధికారంలో ఉన్న షేక్ హసీనా ఇప్పుడు ఢాకాను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆమె మళ్లీ రాజకీయాల్లోకి తిరిగి రాదని కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్ ప్రకటించారు. ఇదే జరిగితే హింసాకాండ తర్వాత మొదలైన షేక్ హసీనా రాజకీయ ఇన్నింగ్స్ కు విషాదాంతం మిగిలిపోతుంది.

షేక్ హసీనా రాజకీయ జీవితం ప్రారంభం ఇలా.. ?
షేక్ హసీనా 1947లో జన్మించారు. ఆమె ముజీర్‌బుర్ రెహమాన్ పెద్ద కూతురు. చిన్నప్పటి నుంచి ఆమెపై తండ్రి ప్రభావం చాలా ఉండేది. ఆమె విద్యార్థి జీవితంలోనే ఆ ప్రభావం కనిపించింది. కాలేజీ రోజుల్లో విద్యార్థి రాజకీయాల్లో హసీనా యాక్టివ్‌గా ఉన్నారు. ఢాకా యూనివర్శిటీలో స్టూడెంట్ లీగ్ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. 1967లో ఆమె శాస్త్రవేత్త వాజిద్ మియాన్‌ను వివాహం చేసుకుంది. తూర్పు పాకిస్తాన్‌ను బంగ్లాదేశ్‌గా మార్చడానికి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్ 1971లో ఏర్పడింది. షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. బంగ్లాదేశ్ పుట్టింది, అంతా బాగానే ఉంది. ఇంతలో షేక్ హసీనా భర్తతో కలిసి జర్మనీ వెళ్లింది. బహుశా విధి తనను మళ్లీ బంగ్లాకు తీసకువస్తుందని అనుకోలేదేమో?

49 ఏళ్ల క్రితం ఏం జరిగింది
1975 ఆగస్టులో జరిగిన హింసాకాండలో హసీనా తండ్రి ముజీర్‌బుర్ రెహమాన్ చనిపోయాడు. బంగ్లాదేశ్‌కు వేల కిలోమీటర్ల దూరంలో జర్మనీలో ఉన్న షేక్ హసీనాకు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ కు గురైంది. తండ్రినే కాదు కుటుంబం కూడా అంతమైంది. దారుణం ఏమిటంటే, ఆమె తన తండ్రిని చివరిసారిగా చూడటానికి తన దేశానికి చేరుకోలేకపోయింది. అప్పుడు భారతదేశం సహాయం అందించింది. దీనికి అంగీకరించిన షేక్ హసీనా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీకి వచ్చింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా ఈ సహాయాన్ని అందించారు. షేక్ హసీనా తన పేరు, గుర్తింపును మార్చుకున్న తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ఢిల్లీలో నివసించారు. ఈ విషయం షేక్ హసీనా విశ్వసనీయ వ్యక్తులకు మాత్రమే తెలుసు.
బంగ్లాదేశ్ మారిపోయింది. జియావుర్ రెహ్మాన్ సైనిక పాలన సాగుతున్నది. భారత్‌లో అజ్ఞాత జీవితం గడుపుతున్న షేక్ హసీనా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. 1981లో షేక్ హసీనా తన దేశం కోసం తన స్వరాన్ని పెంచింది. ఆమె తన తండ్రి పార్టీ అవామీ లీగ్‌కి అధ్యక్షురాలైంది. తన దేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ఆమె తిరిగి రాగానే బంగ్లాదేశ్ ప్రజలు ఆమెకు స్వాగతం పలికారు. దీన్ని అప్పటి ప్రభుత్వం జీర్ణించుకోలేక ఆమెను అరెస్టు చేసింది. అవినీతి ఆరోపణలు వచ్చాయి.

పోరాడి విజయం సాధించారు
షేక్ హసీనా రాజకీయ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఆమెను అరెస్టు చేసి విడుదల చేశారు. 1986లో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. షేక్ హసీనా విడుదలైంది, ఆమె సర్వ శక్తులు ఒడ్డి ఎన్నికల్లో పోటీ చేసి 100 సీట్లు గెలుచుకుని ప్రతిపక్షంలో కూర్చున్నారు. 1996లో ఎన్నికలు జరిగినప్పుడు, షేక్ హసీనా మొదటిసారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయ్యారు, కానీ 2001లో ఆమె మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధికారాన్ని కైవసం చేసుకుంది.

దేశంలోకి ప్రవేశం నిషేధం..
షేక్ హసీనా 2007లో అమెరికా వెళ్ళింది. ఆమె తిరిగి రాకముందే, అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆమెను బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించకుండా నిషేధించింది. 15 రోజుల నాటకీయ సంఘటనల తర్వాత నిషేధాన్ని ఎత్తివేశారు. ఆమె తిరిగి వచ్చి ప్రజల మద్దతును పొందింది. 2009లో ఎన్నికలు జరిగాయి. షేక్ హసీనా మళ్లీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండి ఆమె బంగ్లాదేశ్ ను నిరంతరం పరిపాలిస్తున్నది. కానీ ప్రస్తుత పరిణామాల దృష్ట్యా తిరిగి ఆమె రాజకీయాల్లోకి రాకపోవచ్చు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *